ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమరావతిలో రతనాటాటా ఇన్నోవేషన్ హబ్ (Ratanatata Innovation Hub) ఏర్పాటుకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. మంగళగిరి (Mangalagiri) వద్ద లాంఛనంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ (CM Chandrababu, Minister Nara Lokesh)లు దీనిని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణం(Mayuri Tech Park premises)లో దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు అయ్యింది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణను సిద్ధం చేశారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రిడ్ ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి కేంద్రంగా హబ్, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌లు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం
వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పని చేస్తుందన్నారు. ఇందుకనుగుణంగా విద్యా వ్యవస్థ పునాదులు బలోపేతం చేసి విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ముందున్న సవాళ్లకు తగ్గట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకునే కార్యాచరణతో పని చేస్తున్నట్లు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో పని చేస్తున్నందున దేశానికి ఏపీ ఆవిష్కరణల హబ్‌గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. వ్యాపారం అంటే లాభాలు మాత్రమే కాదని విలువలు, మానవత్వంతో కూడిన పని అని చాటిన మహనీయుడు రతన్ టాటా అని లోకేశ్ కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈ వినూత్న ఆవిష్కరణల వేదికను అంకింతమిస్తున్నట్లు తెలిపారు.