విద్యాశాఖకు అదనంగా నిధులు మంజూరు చేసిన కేంద్రం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా కేంద్రం నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు అదనంగా నిధులు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరం సమగ్ర శిక్షణకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధులను రాష్ట్రానికి కేంద్రం మంజూరుచేసింది. మంత్రి లోకేశ్ చొరవతో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఐసీటీ ల్యాబ్స్, స్మార్ట్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఈసారి రూ.167.46 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. దీంతోపాటు డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చడానికి గతంలో 50 శాతం మాత్రమే నిధులు రాగా.. ఈ ఏడాది రూ.45 కోట్లకు గానూ 96 శాతం మేర రూ.43.23 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆదివాసీ విద్యార్థులకు వసతిగృహాల కోసం రూ.11 కోట్లు మంజూరుచేసింది.