ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ (Miss Universe India 2025) పోటీల్లో ఆమె గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా.. మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఈ పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. హరియాణా అమ్మాయి అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా నిలవడంతో మణిక గురించి నెటిజన్‌లు తెగ వెతికేస్తున్నారు. రాజస్థాన్‌లో పుట్టిన ఆమె ప్రస్తుతం దిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డ్యాన్సర్. జాతీయస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. మణికకు సమాజ సేవ కూడా ఎక్కువే.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించారు. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సేవలు అందిస్తున్నారు.