జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గిరిజన బంజారా తండాల్లో తీజ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన పూజలు, ఊరేగింపులు, యువతులు చేసిన నృత్యాలు చూపరులను అలరించాయి.
ఉదయం పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో బంజారా యువతులు, మహిళలు, పురుషులు కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాతలకు నైవేద్యం సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు.
తరువాత యువతులు, మహిళలు బుట్టల్లో తీజ్‌ను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా ప్రధాన రహదారి మీదుగా సేవాలాల్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. డీజే చప్పుళ్ల నడుమ బంజారా సంప్రదాయ పాటలు, నృత్యాలతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
మండలంలోని కవ్వాల, హాస్టల్ తండా, బంగారు తండా, కొత్తపేట తదితర గ్రామాల్లో కూడా యువతులు, మహిళలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ తీజ్ నిమజ్జనాన్ని ఆనందంగా జరుపుకున్నారు. వాగులు, చెరువులు, గోదావరిలో తీజ్‌ను నిమజ్జనం చేశారు.
ఈ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బి. జాన్సన్ నాయక్, బంజారా నేతలు భీమ్లా నాయక్, సందేశ్ నాయక్, బి. ప్రకాష్ నాయక్, రాములు నాయక్, దినేష్, నందు నాయక్, చందూలాల్, రవీందర్, సవాయిరాం, బిక్కు, సుదన్ లాల్, సాయి కుమార్, బి. శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.