ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ముఖ్యంగా రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పర్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇప్పటికే కురిసిన వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
అదే సమయంలో, బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరంలేకుండా బయటకు వెళ్లకుండదని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.