తెరుచుకున్న అయ్య‌ప్ప ఆల‌యం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : కేరళ (Kerala)లోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం (Sabarimala Ayyappaswamy Temple) తలుపులు తెరుచుకున్నాయి. వార్షిక చింగం మాస పూజల నేప‌థ్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు పూజారులు తలుపులు తెరిచారు. ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి తంత్రి కందరరు మహేష్ మోహనరు సమక్షంలో ఆలయ దీపాలను, ఆళి (పవిత్ర అగ్నిగుండం)ను వెలిగించారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు(Devotees) భారీ వర్షాన్ని(Rain) లెక్కచేయకుండా వేడుకను తిలకించారు.

సెప్టెంబర్ 20న సమావేశం
చింగం మాస పూజలను పూర్తి అయ్యే వరకు పడిపూజ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. అదే సమయంలో సెప్టెంబర్ 20న పంబా నది (Pamba River) ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సమావేశం జరుగుతుందని దేవాదాయ శాఖ (Devadaya department) మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి కాబట్టి, ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా నిలవనుందని తెలిపారు. వివిధ దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు.

మాస్టర్ ప్లాన్‌ రెడీ
శబరిమల ప్రపంచ ఖ్యాతిని పెంచే లక్ష్యంతో జరిగే ఆ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. శబరిమల సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల ప్రయోజనాలను గౌరవిస్తూ, శబరిమలని ప్రపంచ తీర్థయాత్ర కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి వాసవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1,300 కోట్ల విలువైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిందని తెలిపారు. అందులో శబరిమల విమానాశ్రయం, కొత్త రైల్వే లైన్ సహా వివిధ ప్రణాళికలు ఉన్నాయి. విమానాశ్రయం 2028 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రవాణా, వసతి ఏర్పాట్లు
అదే సమయంలో జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో పథనం తిట్టలో ప్రధాన నిర్వాహక కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. పంబా, పెరునాడ్, సీతాథోడ్‌లలో అదనపు కార్యాలయాలు ఉంటాయి. ప్రతినిధులకు KSRTC బస్సుల ద్వారా రవాణా, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. పంబాతో సహా ఆ ప్రాంతంలోని ఆసుపత్రులలో ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించనున్నారు. వాహనాల పార్కింగ్ కొండపై ఉండనుంది. స్వచ్ఛంద సంస్థలు పారిశుధ్యం, శుభ్రపరిచే విషయంలో సహాయం చేస్తాయి.

Leave a Reply