జ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ పాగా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : క‌డ‌ప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లు ఓ యుద్ధాన్ని త‌ల‌పించాయి. మొద‌టి నుంచి ఈ ఎన్నిక‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం(State of Andhra Pradesh)లో సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌ధాన ఎన్నిక‌లకు కూడా ఇంతలా హైప్ రాలేదు. ఈ రెండు ఉప ఎన్నిక‌లు నోటిఫికేష‌న్ నుంచి మొద‌లు కౌంటింగ్ వ‌ర‌కు హైటెన్ష‌న్‌ను క‌లిగించాయి. రాజకీయ నాయకుల(Politicians) మధ్య సవాళ్లు.. మాటల యుద్ధాలు.. ఘర్షణల మధ్య నువ్వా..నేనా అన్నట్టుగా టీడీపీ, వైసీపీ(TDP, YCP)లు పోటీ ప‌డ్డాయి. ఈ ఎన్నిక‌లు మామూలుగా ఇత‌ర ప్రాంతాల్లో అయితే లైట్ తీసుకుంటారు. కానీ పులివెందుల‌(Pulivendula)లో టీడీపీ, వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జ‌గ‌న్ (Former CM Jagan) ఇలాఖా అయిన పులివెందుల గోడ‌లు బ‌ద్ద‌లు కొట్టాల‌ని టీడీపీ కంక‌ణం క‌ట్టుకుంది. అదే సంక‌ల్పంతో ముందుకు సాగింది.

పార్టీ అధినేత‌ల స్పెష‌ల్ ఫోక‌స్‌
ఒక్క జడ్పీటీసీ (ZPTC) ఎన్నిక ఇంత హాట్‌గా సాగుతుందని.. ఇన్ని ట్విస్టులు ఉంటాయని.. అసెంబ్లీ ఎన్నికలనే మర్చిపోయేలా చేస్తుందని.. ఎవరూ ఊహించి ఉండరు బహుశా ! కడప జిల్లా(Kadapa District) అంటేనే వైఎస్ ఫ్యామిలీ(YS Family) కంచుకోట. అక్కడ గెలిచి ఫ్యాన్ పార్టీ స్విచ్‌ నొక్కేయాలని టీడీపీ.. తగ్గింది సీట్లే జనంలో బలం కాదు అని అని ప్రూవ్‌ చేసుకునేందుకు వైసీపీ.. రెండు పార్టీల పట్టుదలతో.. చిన్నపాటి యుద్ధమే కనిపించింది కడప జిల్లాలో. పార్టీ అధినేతలే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఉపఎన్నిక.. పార్టీలో కీలక నేతల నుంచి మంత్రుల వరకు ప్రచారం దిగారు.

బరిలో 11 మంది…
మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. పులివెందుల(Pulivendula) స్థానంపై.. రెండు పార్టీల అధినేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతీదానిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రులు, కీలక నేతలంతా ప్రచారంలో కనిపించగా.. వైసీపీ తరఫున ఎంపీ అవినాశ్‌రెడ్డి(MP Avinash Reddy) భారం అంతా భుజాల మీదకు ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌ల వై నాట్ కుప్పం అంటూ వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తే.. ఇప్పుడు వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ దూకుడు మీద కనిపించింది. బైపోల్‌ను వైసీపీ డూ ఆర్ డైలాగా తీసుకుంటే.. జగన్‌ కంచుకోటలో గెలిచి.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్‌కు బలమైన సందేశాన్ని పంపించాలనే కసితో టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇక జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో కనిపించిన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. వివేకా మర్డర్‌ చుట్టూనే రాజకీయం అంతా తిరిగింది. వైసీపీని కార్నర్ చేస్తూ.. ఈ ఘటనను అస్త్రంగా మార్చుకొని టీడీపీ దూకుడు మీద కనిపించింది. పైగా వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్ధిగా బరిలో ఉండడం.. బైపోల్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఇక అటు కాంగ్రెస్ తరఫున షర్మిల సన్నిహితుడు పోటీ చేశారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. అదే స్థాయిలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాయనే గుసగుసలు వినిపించాయి. ఎప్పుడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ ఓటర్లకు భారీగానే ముట్టజెప్పార‌ని చ‌ర్చ జ‌రిగింది. పోలింగ్ రోజు ఘ‌ర్ష‌ణ‌లు, రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ఇలా.. ప్ర‌తీ అంశం థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పించింది. ఇంత‌లా హైటెన్ష‌న్ సృష్టించిన ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీడీపీ తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

వైసీపీకి ఘోర పరాభవం
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఎన్నిక‌లను టీడీపీ వార్ వ‌న్‌సైడ్ చేశాయి. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. లతారెడ్డికి, హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ, వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి.

Leave a Reply