- పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరిక
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈరోజు (శనివారం) రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు వనస్థలిపురం, హయత్‌నగర్, బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, సరూర్‌నగర్, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నగరంలోని బాలానగర్, పటాన్ చెరు, లింగంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోనూ వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది.
ట్రాఫిక్ జామ్‌లు, నీట మునిగిన రహదారులు
భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, చార్మినార్, పటాన్ చెరు, మీర్‌పేట్, ఆమీర్‌పేట్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రహదారులపై నీరు నిల్వ ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల మాన్‌హోల్‌లు పొంగిపొర్లడంతో ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ శనివారం సాయంత్రం వర్షాలు కురిశాయి. రాత్రి వేళల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరో రెండు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది వచ్చే నాలుగు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా.