TG | అధికారం ఇస్తే గాడిద గుడ్డు ఇచ్చారు : బండి సంజయ్
- కుల గణన బోగస్
- కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటే
- ప్రశ్నించే గొంతులకు ఓటెయ్యండి
- ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ను ఛీ కొట్టారు
కరీంనగర్, ఆంధ్రప్రభ : మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు చేతిలో పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రలో మాట్లాడుతూ 14 నెలల క్రితం ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందన్నారు.
ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని, మహిళలందరికీ 25 వందల రూపాయలు ఇస్తామని, రైతు భరోసా 15000 ఇస్తామని, పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన హామీలు అమలు చేయడం లేదన్నారు.
ఏ హామీ అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే ప్రజలు తెలంగాణలో చేస్తున్న మోసాన్ని గమనించి ఫలితాల్లో గుండు సున్న ఇచ్చారన్నారు. ఢిల్లీ ప్రజలు కాషాయానికి జై కొట్టారని మోడీ నామస్మరణ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం భారతీయ జనతా పార్టీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లామన్నారు.
ఆ సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ పార్టీ మంత్రులు కానీ ఒక్కరు కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడా లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ ప్రభుత్వం మాట తప్పిందని, మోడీ సర్కారు మాత్రం ఏడాది కాలంలో 9 లక్షల 25 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఢిల్లీ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని ఫిబ్రవరి 27 తేదీన జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రశ్నించే గొంతుకలైన బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే డీఏ కోసం ప్రశ్నించేవారు ఉండరని పిఆర్సి కోసం డిమాండ్ చేసేవారు ఉండరన్నారు.
బిజెపి అభ్యర్థులైన అంజిరెడ్డి, కొమురయ్య, సరోత్తమ్ రెడ్డిలను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోటీలో ఉండడం లేదన్నారు.
కాలేశ్వరం కేసు, ఫామ్ హౌస్ కేసు, డ్రగ్స్ కేసు, కార్ రేసుల్లో నిందితులను అరెస్టు చేసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు తెలియజేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం వెనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం ఉంటామని ఒప్పందం కుదుర్చుకోవడమే అన్నారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం మేరకే పోటీకి దూరంగా ఉన్నారని, అందువల్లే కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం లేదన్నారు.
బీసీ కుల గణన మొత్తం బోగస్ అని, ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల 30 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో రాష్ట్ర జనాభా మూడు కోట్ల 70 లక్షలు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల 30 లక్షలకు పైగా ఉందన్నారు.
60 లక్షల మందిని సర్వేలో చూపెట్టకపోవడం వెనక ముస్లింలను బీసీలుగా చేర్చే కుట్ర దాగి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలను బీసీలుగా గుర్తించొద్దని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంద పెట్టాలని, అప్పుడే రేవంత్ సర్కార్ కు బుద్ధి వస్తుందన్నారు.