కొడిగెనహళ్లి గురుకుల పాఠశాలలో పి.వి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
హాజరైన పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు
శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ) : బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం గురుకులాలను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గురుకులాలకు ఆధ్యులుగా చెప్పుకోవచ్చని, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల వేత్త దివంగత పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని శనివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని కొడిగిన హళ్లి గురుకుల పాఠశాలలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు ఏర్పాటులో ఆధ్యుడు దివంగత నేత పీవీ నరసింహారావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాలలో గురుకుల పాఠశాలల ఆవశ్యకతను గుర్తించి, రాష్ట్రంలో తొలిసారి గురుకుల పాఠశాలలను నెలకొల్పి లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తు చూపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన పట్ల ఉన్న, గౌరవం అభిమానంతో తాము చదువుకున్న పాఠశాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీవీ నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ సురభి వానిదేవి మాట్లాడుతూ.. తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకరంగా ఉందన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు స్వర్గీయ పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో ముఖ్యలు రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్, శ్రీనివాసరాజు ఐఏఎస్, బాలరాజు ఐపీఎస్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆదాయ పందుల శాఖ కమిషనర్ రఘువీర్ యాదవ్, ఆంజనేయులు ఐ ఆర్ ఏ ఎస్, డైరెక్టర్ ఆంజనేయులు, విపత్తులు అగ్నిమాపక సేవలు డైరెక్టర్ మురళీమోహన్ ఏపీ ఆర్ ఈ ఐ కార్యదర్శి మస్తానయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ మత్స్య రాజు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రతినిధి పెరుగు సురేష్ తో పాటు గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.