Exclusive | వడ్లు మింగేసిన సౌభాగ్య లక్ష్మి -పెద్దపల్లిలో భారీ కుంభకోణం

మిల్లర్లకు నైవేద్యంగా సీఎంఆర్​ ధాన్యం
టాస్క్ ఫోర్స్ దాడులతో బహిర్గతం
రెండు మిల్లులోనే 72 వేల క్వింటాళ్ల షార్టేజ్
మిల్లర్లతో కుమ్ముక్కు అవుతున్న అధికారులు
పెద్దపల్లి జిల్లాలోనే 220 రైసు మిల్లులు
దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం ఉంటుందని అంచనా
లోతుగా విచారణ జరిపితే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం

పెద్దపల్లి, ప్రతినిధి, ఆంధ్రప్రభ
పెద్దపెల్లి జిల్లాలో (peddapalli District ) అతిపెద్ద కుంభకోణం (scam ) వెలుగు చూసింది.. సీఎంఆర్ ధాన్యం (CMR paddy ) రైస్ మిల్లర్ల (rice millers ) పాలిట వరంగా (boon ) మారింది.. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యంగా మార్చేందుకు రైస్ మిల్లర్లకు ఇస్తే.. వాటిని అప్పనంగా అమ్ముకుంటున్నారు. టాస్క్ ఫోర్సు (task force ) దాడుల్లో కేవలం రెండు మిల్లుల్లో 72,000 క్వింటాళ్ల వడ్లు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నాయి అంటే ఏ మేర కుంభకోణం జరిగిందో అర్థమవుతోంది. రెండు మిల్లులో 23 కోట్ల 71 లక్షల రూపాయల ధాన్యం షార్టేజ్ ఉందని రాష్ట్ర సివిల్ సప్లయీస్​ (civil supply ) అధికారి ప్రభాకర్ రావు తెలియజేయడం కుంభకోణాన్ని బహిర్గతం చేసింది.

కస్టమ్​ మిల్లింగ్​లో మొత్తం స్వాహా..

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్​లో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు మిల్లుల నుంచి తరలిస్తున్న అయిదు లారీల ధాన్యాన్ని పట్టుకొని విచారణలో భాగంగా రెండు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. సాయి మహాలక్ష్మి రైస్ మిల్​కు 2023- 24 యాసంగి సీజన్​లో ప్రభుత్వం కొనుగోలు చేసిన 80,966 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించింది. దీనికి 35వేల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అందజేయాల్సి ఉంది. అయితే.. కేవలం 10వేల 84 క్వింటాళ్ల బియ్యం మాత్రమే అందించారు. మిల్లులో 64,922 క్వింటాళ్ల వడ్లు నిల్వ ఉండాల్సి ఉండగా అధికారుల తనిఖీల్లో కేవలం 3266 క్వింటాళ్ల వడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా 61,653.57 క్వింటాళ్ల వడ్లు షార్టేజ్ రావడంతో మిల్లు యాజమాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం అమ్ముకున్నట్లు బహిర్గతమైంది.

220 మిల్లుల్లోనూ ఇదే తీరు..

మరో మిల్లు సౌభాగ్య లక్ష్మికి యాసంగి సీజన్​లో 31,060 క్వింటాళ్ల వడ్లు కేటాయించగా.. ప్రభుత్వానికి 21,190 క్వింటాళ్ల బియ్యం అందించాల్సి ఉంది. కానీ, కేవలం 5,151 క్వింటాళ్ల బియ్యం మాత్రమే అందజేశారు. 23,500 క్వింటాళ్ల వడ్లు మిల్లులో ఉండాల్సి ఉండగా అధికారుల తనిఖీల్లో 10,880.14 క్వింటాళ్ల వడ్లు మాత్రమే ఉండడంతో అసలు కుంభకోణం బహిర్గతమైంది. ఈ రెండు మిల్లుల్లో 72,533.71 క్వింటాళ్ల వడ్లు కనబడకుండా పోయాయి. దీని విలువ దాదాపు ₹23,71,36,972 అని అధికారులు తెలియజేశారు. రెండు మిల్లుల్లోనే 23 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందంటే పెద్దపెల్లి జిల్లాలో ఉన్న 220 మిల్లుల్లో ఎన్ని కోట్ల క్వింటాళ్ల వరి ధాన్యం మిల్లర్లు అమ్ముకున్నారో పూర్తిగా తెలియాలంటే అధికారులు లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

సంఘం పెద్దమనిషి నుంచే దందా షురూ..

దాదాపు ప్రతి రైస్ మిల్లులో ఉండాల్సిన వడ్లు లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎంఆర్ కింద కేటాయించిన వేలాది కోట్ల రూపాయల అవార్డులు మిల్లర్లు అప్పనంగా అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యాసంగి, వానాకాలం సీజన్లలో కేటాయించిన అవార్డులు బియ్యంగా మార్చి ఇవ్వని రైస్ మిల్లర్లకు కూడా ఈసారి పెద్ద మొత్తంలో వడ్లు తిరిగి కేటాయించడంపై అనేక అనుమానాలున్నాయి. అధికారులు మిల్లర్లతో కొమ్ముకై చేతివాటం ప్రదర్శించి నిబంధనలను తుంగతుర్తి కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు కట్టబెట్టారు. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులతో ఈ వడ్ల కుంభకోణం తేటతెల్లమైందే తప్ప స్థానిక అధికారులు ఈ కుంభకోణాన్ని వెలుగు తీయ లేదంటేనే వారు చేతివాటం ప్రదర్శించారానేందుకు నిదర్శనం. పెద్దపెల్లి జిల్లాలోని సంఘం పెద్దమనిషిగా చెప్పుకునే రైసు మిల్లర్ ఒక్కరే 150 కోట్లకు పైగా వడ్లను అమ్ముకున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి సివిల్ సప్లై అధికారులు పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లులపై దాడులు నిర్వహించి లోతైన విచారణ చేపడితే 1000 కోట్ల కుంభకోణం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి.

Leave a Reply