Surrendered | 23 మంది మావోయిస్టులు లొంగుబాటు.. సుక్మాలో నయా పోలీసు చరిత్ర

ఆంధ్రప్రభ, చింతూరు, అల్లూరి జిల్లాః
ఛ‌త్తీస్‌గఢ్‌ (chattisgarh ) సుక్మాలో (sukma ) తమ తలకు రూ. 1.18 కోట్ల నజరానా కలిగిన 23 మంది మావోయిస్టులు (maoists) లొంగిపోయారు . వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దండకారణ్యంలో సంచలనాత్మక మావోయిస్టు మాడవీ హిడ్మా (Hidma ) పీఎల్ ఆధీనంలోని పీఎల్ జీఏ (PLGA) బెటాలియన్‌లో చురుకుగా పని చేసిన ఎనిమిది మంది హార్డ్‌కోర్ (Hardcore) మావోయిస్టులు ఉన్నారు. వీరి ఒకరు డీవీసీ సభ్యులు, ఆరుగురు పీపీసీ సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు, 12 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన 23 మంది మావోయిస్టుల్లో 9 మంది మహిళలు కాగా, మూడు మావోయిస్టు ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన ఛత్తీస్‌ గఢ్ నక్సలైట్ లొంగుబాటు పునరావాస విధానం, నియాద్ నెల్లా నార్ పథకాన్ని అమలు చేయటమే కాదు, అంతర్గత ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడంతో పోలీసుల ప్రభావం పెరుగుతోంది. ఈ స్థితిలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం వేగం పుంజుకొంది.

తాజాగా లొంగుబాట పట్టిన 11 మంది మావోయిస్టుల్లో ఒక్కొక్కరి తలకు రూ.8 లక్షలు, నలుగురికి రూ.5 లక్షలు, ఒకరికి రూ.3 లక్షలు, ఏడుగురుకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.1 కోటి 18 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. ఈ రివార్డు మొత్తం లొంగిపోయిన మావోయిస్టులకు అందజేస్తారు. ఇక చత్తీస్ గడ్ ప్రభుత్వం వీరికి పునరావాస పథకాన్ని అమలు చేస్తుంది. శుక్రవారం కూడా 22 మంది మావోయిస్టులు లొంగిపోగా.. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. వీరందరి తలపై రూ.37లక్షల రివార్డు ఉంది. ఈ రివార్డుతో పాటు ఒక్కొక్కరూ రూ.25,000లు పునరావాస పథకంలో అందుకున్నారు. 2024 నుంచి ఇప్పటి వరకూ 792 మంది మావోయిస్టులు లొంగిపోయారని చత్తీస్ గడ్ పోలీసులు ప్రకటించారు.

Leave a Reply