హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (phone tapping ) కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు (prabhakara rao ) ను కస్టడీకి (custody ) ఇవ్వాలని సుప్రీంకోర్టును (supreme court ) సిట్ ఆశ్రయించనుంది. ఈ మేరకు సిట్ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలని పిటీషన్ వేయనుంది.
విచారణకు సహకరించని ప్రభాకర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ సుప్రీంకోర్టుకు తెలపనుంది. అందుకే కస్టడీ కి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నారు. ప్రభాకర్ రావును అమెరికా నుంచి తెప్పించడానికి ఎన్నో అవస్థలు పడిన సంగతి విదితమే. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకుని విచారిస్తే.. మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు డీసీపీ, ఏసీపీలు ఢిల్లీకి వెళ్లారు. మరీ సుప్రీం కోర్టులో సిట్ అధికారులకు ఊరట దక్కుతుందా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.
మరోసారి విచారణకు హాజరైన ప్రభాకరరావు ..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు మరోసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు అధికారులు.
ఇప్పటికే సిట్ అధికారులు నిందితులు, సాక్షుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని ఆధారంగా చేసుకుని ప్రభాకర్ రావును మరింత లోతుగా ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ కేసులో ట్యాపింగ్‌కు గురైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నేడు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలపై స్పష్టత రాబట్టేందుకు సిట్ అడుగులు వేగంగా సాగుతోంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అధికారులు ప్రతి అంశాన్ని క్షున్నంగా పరిశీలిస్తున్నారు.