హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పాత కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ చేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించి, ట్రాఫిక్ (Traffic) కు అంతరాయం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి (Nampally) లోని ప్రజాప్రతినిధుల కోర్టు (Representatives Court) లో విచారణ జరుగుతోంది.
అయితే, ఈ కేసు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.