అమ్మకు వందనం డబుల్ ఇంజన్ ఫలితం
తొలి విడతలో రూ.8745 కోట్లు విడుదల
67 లక్షల తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ
నేడు 9.51 లక్షల అమ్మలకు వందనం
కొన్ని చోట్ల షరతుల కట్టడితో అసంతృప్తి
ఆంధ్రప్రభ .. సెంట్రల్ డెస్క్ . నెక్ టై కట్టి.. కాళ్లకు బూట్లు తొడిగి.. నడుము బెల్టు పెట్టుకుని, భుజాన పుస్తకాల బ్యాగుతో పెత్తందారీ బిడ్డలు బస్సు ఎక్కి స్కూలుకు వెళ్తుంటే.. పేదింటి తల్లి తన బిడ్డల్ని కనీసం సర్కారీ బడికి పంపించలేని దుస్థితి. రోజువారీ కూలీనాలీ బతుకులీడ్చే ఈ కుటుంబంలోని పిల్లలు పశువుల కాపర్లుగా.. పొలంలో కలుపు తీసే కూలీలుగా తిరిగే దృశ్యాలు గ్రామాల్లో ఎన్నో ఎన్నెన్నో. ఇప్పుడు కాలం మారిపోయింది. పేదింటి బిడ్డలూ బడి బాట పడుతున్నారు. బిరబిరా పరుగులు తీస్తున్నారు. అమ్మానాన్న హ్యాపీ హ్యాపీగా తమ బుడతలకు బై బై చెబుతున్నారు. ఇటీవల పాలకులకు చదువుపై మమకారం పెరిగింది. ఉజ్వల భవిష్యత్తుకు చదువే ఆధారం.. చదువుతోనే నైపుణ్యం.. నైపుణ్యంతోనే సంపద సృష్టి అని పాలకులు గుర్తించారు. సర్కారీ స్కూళ్లను భవిష్య కర్మాగారాలుగా తీర్చిదిద్దే క్రతువుపై దృష్టి సారించారు. కానీ అప్పటికే సర్కారీ స్కూళ్లన్నీ వట్టిపోయే స్థితికి చేరుకున్నాయి. అక్షరం ముక్కతోనే బాల్యం బడికి దూరమవుతోంది.
ఇందుకు కారణం.. ఆకలి, పేదరికమని గ్రహించి.. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపించే అమ్మ ఒడి పథకం రచించారు. అమలు చేశారు. మొత్తం 44,617 ప్రభుత్వ పాఠశాలలు, 13,249 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, 1,084 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు 62,182 పాఠశాలల్లో 2,86,311 ఉపాధ్యాయులు పని చేస్తుంటే.. లక్షలాది మంది పిల్లలు బడికి రావటం లేదు. వచ్చిన మధ్యలో ఆగిపోతున్నారు. 2020-..21లో 73,12,852 మంది విద్యార్థులే చదివారు. 2020లో 43 లక్షల తల్లులకు, రెండో ఏడాది 44.48 లక్షల అమ్మల బ్యాంకు ఖాతాల్లో అమ్మ ఒడి సొమ్ము జమ చేశారు. కానీ 20 23-,, 24 విద్యా సంవత్సరంలో ఏపీలో 2,63,094 మంది విద్యార్థులు బడికి రాలేదు. 2024..-25లో ఆ సంఖ్య 68,51,745 కు తగ్గింది. అంటే మరో 2,63,094 మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. అమ్మ ఒడి సొమ్ము ఇచ్చినా డ్రాప్ అవుట్ ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో… గత ఎన్నికల్లో తాము ప్రభుత్వం లోకి వస్తే ప్రతి బిడ్డను చదివించేందుకు తల్లికి వందనం పథకాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఎన్నికల హామీని అమలు చేస్తోంది.
2022..-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు గత ప్రభుత్వం రూ.6,392.94 కోట్లు జమ చేయగా.. తాజాగా 67,27,164 మంది తల్లులకు ఇంటిలోని ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం కోసం రూ.8,745 కోట్లు జమ చేసింది.
గతంతో పోల్చితే 24,65,199 మంది తల్లులు అదనంగా పెరిగారు. వ్యయం రూ.2,352.06 కోట్లు పెరిగింది. తాజాగా గురువారం మలివిడత అమ్మకు వందనం పథకంలో 9.51 లక్షల మంది అమ్మల ఖాతాలో కూటమి ప్రభుత్వం రూ.1236 కోట్లు జమచేస్తోంది. ఈ పథకం అమలులో కొన్ని షరతుల కారణంగా ఏపీలో సుమారు 1.12 లక్షల మందికి అమ్మకు వందనం సాయం అందటం లేదు. ఏపీలో వివిధ జిల్లాల్లో అత్యధిక మంది అమ్మానాన్నలు కూటమి సర్కారును ప్రశంసిస్తున్నారు. తమ బిడ్డలందరినీ చదివించే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు చార్జీలు, ఇతర షరతుల ఆధారంగా అమ్మకు వందనం సొమ్ము దక్కని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అమ్మకు వందనం పథకంపై ప్రజల్లోని ఆనందోత్సాహాలు, భిన్నాభిప్రాయాలు ఇలా ఉన్నాయి.