Devotional | ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అన్ని యుగాల్లో వివిధ రూపాలలో భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి మరో దివ్య స్వరూపం విలక్షణమైన విశేషమైన అలంకారం శాకంబరీ దేవి. పూర్వం దుర్గ మాసురుడు అనే రాక్షసుడు వేదమంత్రాలను అపహరించడంతో, భూలోకంలో వేద జ్ఞానం లేక అనావృష్టి ఏర్పడింది. చైత్ర వాల్సస్తులందరూ కనకదుర్గమ్మ వారి కోసం తపస్సు ఆచరించడంతో త్రయోదశి రోజున అనుగ్రహించిన చతుర్దశి రోజున కరుణాకటాక్షాలతో శాకాంబరీ దేవి అవతారంలో భూలోకానికి సంపూర్ణ ఆహార పదార్థాలు అందించినట్లు మన ఇతిహాసాలు చెబుతున్నాయి. నాటినుండి కనకదుర్గమ్మ వారికి ఆషాడ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు మూడు రోజులు పాటు శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

సకల భూలోకానికి అన్న పానీయాలు అందించడంతోపాటు, సకల జీవరాసులు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రకృతిని కాపాడుతూ వస్తున్న ఆ కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా దర్శనమిస్తోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో విశ్వావాసు నామ సంవత్సర శాకాంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలు ఇంద్రకీలాద్రి అన్ని ప్రాంతాలలో కూరగాయలు ఆకుకూరలు పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మొదటిరోజు అలంకరణ కదంబ ప్రసాదం వంటి వాటికోసం 50 టన్నుల కూరగాయలు వినియోగించడంతో ఇంద్రకీలాద్రి మొత్తం హరిత వర్ణంలో శోభిల్లుతున్నది. శాకాంబరీ ఉత్సవాల కోసం ఉమ్మడి గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల నుండి రైతులు వ్యాపారస్తులు దాతలు పెద్ద ఎత్తున కూరగాయలు పండ్లను విరాళంగా అందజేశారు.

పూజలు చేసి ప్రారంభించిన ఈవో…

కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు మంగళవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. విజ్ఞేశ్వర పూజ రిత్విక్ వరుణ పుణ్యాహ వాచనంతోపాటు అఖండ దీపారాధన అంకురాత్పన కార్యక్రమాలు వంటివి కొనసాగాయి. వీటితోపాటు కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక కుంకుమ పూజలు, హోమాలు విశేష పూజలను నిర్వహించారు. మహా మండపం ఆరవ అంతస్తులో ఉత్సవమూర్తి విగ్రహానికి కూరగాయలతో సుందరంగా అలంకరించారు. అలాగే 7వ అంతస్తు మహాగోపురం ఎదురుగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి కూరగాయల సేకరణ, అలంకరణతో పాటు కొన్ని కార్యక్రమాల కోసం అధికారుల సిబ్బంది గడిచిన 10 రోజుల నుండి శ్రమిస్తూ వచ్చారు. వీరికి సేవాదళ్ కార్యకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు.

కదంబ ప్రసాదం పంపిణీ..

శాకంబరీ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది శాకాంబరి అమ్మవారి కదంబ ప్రసాదం. కనకదుర్గమ్మకు అత్యంత ఇష్టమైన ఈ అలంకరణలో భాగంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు, పండ్లతో అలంకరిస్తారు. వీటితో తయారు చేస్తున్న కదంబ ప్రసాదం భక్తులు ఎంతో ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంటారు. మూడు రోజులపాటు జరిగే ఈ శాకంబరీ ఉత్సవాలలో భాగంగా మంగళవారం నుండి భక్తులకు కదంబ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. పంపిణీ వితరణ కార్యక్రమాన్ని కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ మంగళవారం స్వయంగా ప్రారంభించారు. పరమ పవిత్రమైన అమ్మవారి కదంబ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఇష్టపూర్వకంగా తృప్తిగా స్వీకరిస్తున్నారు.

భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ..

ఇటు ఆషాడ సారె మహోత్సవాలతో పాటు శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారుల విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుండి విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేసిన అధికారులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలను రద్దు చేశారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేయడంతో పాటు 500 రూపాయల టికెట్ల జారీని కూడా నిలుపుదల చేయనున్నారు. భక్తులందరికీ బంగారు వాకిలి ద్వారా శాకాంబరీ దేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు, అన్ని ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారులను సైతం నియమించారు.

Leave a Reply