జన్నారం, (ఆంధ్రప్రభ): కవ్వాల అడవుల్లోని పాలకూరి ప్రాంతంలో మూకుమ్మడిగా టేకు చెట్ల నరికివేత కొనసాగుతుంది.రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు టేకు చెట్లను నరికి వేసినప్పటికీ సంబంధిత ఫారెస్ట్ రేంజు,సెక్షన్,బీట్ ఆఫీసర్లు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు సర్వత్ర వినవస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ కవ్వాల ఫారెస్ట్ సెక్షన్ సోనాపూర్ తాండ బీట్ అడవుల్లోని పాలగోరి ప్రాంతంలో గత రాత్రి మూకుమ్మడిగా 20 చిన్న, పెద్ద టేకుచెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేసినట్లు తెలిసింది.
ఆ కలప విలువ సుమారు రూ.2,50,000 ఉంటుందని అంచనా. పోడు వ్యవసాయం కోసం కొంతమంది ఆదివాసి గిరిజనులు చిన్న పొరకలను, పెద్ద టేకు చెట్లను నరికి వేసినట్లు అనుమానం.
ఇదే ప్రదేశంలో పోడు వ్యవసాయం కోసం కొంతమంది ఆదివాసి గిరిజనులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూరు మండలాల్లోని పలు గ్రామాల నుంచి చిన్న, పెద్ద టేకుచెట్లను నరికి వేశారు. ఆ ప్రదేశంలోనే 30 తాత్కాలిక గుడిసెలను వేసుకున్నారు.
ఆ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి ఆ ఆదివాసీలకు నచ్చజెప్పి గుడిసెలను తొలగించి, పలువురు ఆదివాసులపై కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండుకు పంపారు. కొద్దిరోజులుగా ఆదివాసీలు స్తబ్దంగా ఉన్నప్పటికీ మళ్లీ అదే చోట అదును చూసి ముకుమ్మడిగా చిన్న, పెద్ద పోరకలను, టేకు చెట్లను నరికి వేసినట్లు తెలిసింది.
ఈ వ్యవహారమై కాలేశ్వరం సీసీఎఫ్ ప్రభాకర్ మంచిర్యాల సీఎఫ్ కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ శాంతారాంలు తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకుని నరికివేతకు గురవుతున్న అడవులను రక్షించాలని పలువురు కోరారు. ఈ విషయమై సమాచారం అందుకున్న స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.