ఒకే వేదికను షేర్ చేసుకున్న రాజ్, ఉద్ధవ్ థాక్రే
మరాఠీ భాష కోసం ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ
త్రిభాషా సూత్రంపై వెనక్కి తగ్గిన మహాయుతి సర్కార్
సభకు శరద్ పవార్, హర్షవర్ధన్ సప్కల్ దూరం
ఇది రాజకీయ లబ్ధి కోసమేనంటున్న బీజేపీ, షిండే వర్గం
ముంబయి, ఆంధ్రప్రభ :
మహారాష్ట్ర (Maharastra )రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న థాక్రే సోదరులు (Thakre Brothers ) .. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే (uddahav ) , మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే (raj ) శనివారం ఒక్కటయ్యారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం ముంబైలోని వర్లీ డోమ్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో వారు ఒకే వేదికను పంచుకున్నారు అపూర్వ కలయికకు ‘మెగా విక్టరీ’ ర్యాలీ వేదికైంది. థాక్రే సోదరులు రాజ్ థాక్రే.. ఉద్ధవ్ థాక్రేలు 20 ఏళ్ల్లుగా ఉన్న వివాదాలను పక్కన పెట్టి థాక్రే సోదరులు కలిసిపోయారు. ఈ అనూహ్య కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ..
రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ రాజ్, ఉద్ధవ్ వర్గాలు కలిసి పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విజయాన్ని ‘మరాఠీ ఐక్యత విజయం’గా అభివర్ణిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు వర్లీ డోమ్‌లో భారీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభలో థ్రాక్రే సోదరులిద్దరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరాఠీ రచయితలు, కవులు, విద్యావేత్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్, కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ హాజరు కాలేదు. ఎంఎన్ఎస్ వర్గాలు వారిని ఆహ్వానించినప్పటికీ, వారు దూరంగా ఉన్నారు.
మే కలిశాం.. ఇక కొత్త రాజకీయం : ఉద్దవ్ థాక్రే
ఈ సభలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ‘మనం ఇప్పుడు కలిశాం.. ఇకపై కలిసే ఉందాం. మన ప్రసంగాలకంటే.. మనం కలిసి ఉండటమే ముఖ్యం’ అని అన్నారు. ఈ సందర్భంగా రాజ్ థాక్రే మాట్లాడుతూ..‘ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మా ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెరిపేశాము’ అని అన్నారు. ఇక కొత్త రాజకీయాలు చూస్తారంటూ ఉద్దవ్ స్పష్టం చేశారు. కాగా అన్నదమ్ముల కలయికతో రెండు పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2005లో విడిపోయి.. 2025లో కలిశారు..
ఉద్ధవ్ థాక్రే.. రాజ్ థాక్రే 2005లో చివరి సారిగా ఒకే స్టేజిపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా రాజ్ పార్టీ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను స్థాపించారు. ఇక అప్పటినుంచి అన్నదమ్ములిద్దరూ ఎడ ముఖం.. పెడ ముఖంగా ఉన్నారు. 2009లో ఎమ్ఎన్ఎస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏకంగా 13 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దారులు వేరైన తర్వాత రాజ్, ఉద్ధవ్‌లు బహిరంగంగా ఒకరిపై ఒకరు లెక్కలేనన్ని సార్లు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి.. కలిసుంటే కలదు సుఖం అని నమ్ముతున్నారు. అందుకే మళ్లీ ఒకటయ్యారు.
బీజేపీ విమర్శ ..
థాకరే సోదరుల కలయికపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది మరాఠీ భాషాభిమానం కాదని, త్వరలో జరగనున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజకీయంగా నిలదొక్కుకోవడానికేనని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే విమర్శించారు. ఉద్ధవ్ నేతృత్వంలో బీఎంసీ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ మంది మరాఠీలు ముంబైని విడిచి వెళ్లారని షిండే వర్గం నేత రామ్‌దాస్ కదమ్ ఆరోపించారు.