చిత్తూరు, జులై 5 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కల్లూరు-సదుం రహదారిలోని చిట్టారెడ్డిపేట (Chittareddypet) సమీపంలో ఒక అడవి ఏనుగు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. వెదురు పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ వార్త తెలియగానే పరిసర గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు (Elephant) ను చూడటానికి పోటెత్తారు.
ఇటీవలి కాలంలో పులిచెర్ల (Pulicherla) మండల పరిధిలో ఏనుగుల గుంపులు సంచరిస్తూ మామిడి, కొబ్బరి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏనుగు కూడా ఆ గుంపులోకి చెందిందో లేదో స్పష్టత లేదు. ప్రస్తుతం ఏనుగు మృతికి గల కారణాలను అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. అటవీ శాఖ (Forest Department) అధికారులు మృతదేహాన్ని పరిశీలించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.