Singareni | పర్యావరణానికి, ప్రజలకు మేలు కలిగేలా మైనింగ్

  • భూగర్భ జలాల పెంపుదలకు ‘నీటి బిందువు-జలసింధువు’
  • ఓసీ గనుల సమీప భూములకు సాగునీరు సరఫరా
  • మూతపడిన గనుల భవంతులలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు
  • ప్రతీ సమీప గ్రామంలో మెడికల్ క్యాంపులు, ఉపాధి హామీ పథకాలు
  • అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో సింగరేణి చర్యలను వివరించిన సీఎండీ ఎన్. బలరామ్

సింగరేణి సంస్థ తన బొగ్గు తవ్వకాలను పర్యావరణానికి నష్టం కలగకుండా, సమీప ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్వహిస్తోందని, సంస్థ అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల, సమీప ప్రాంతాల అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోందని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఉత్తమ మైన్ క్లోజర్ పద్ధతుల ద్వారా పర్యావరణహిత, బాధ్యతాయుత మైనింగ్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన సింగరేణి తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ అవలంబిస్తున్న విధానాలను వివరించారు.

సింగరేణి సంస్థ పర్యావరణకు హాని కల్పించని సర్ఫేస్ మైనర్, ఇన్ పిట్ క్రషర్, డ్రాగ్ లైన్, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ వంటి మైనింగ్ టెక్నాలజీలని వినియోగిస్తుందని, నిబంధనల ప్రకారం మొక్కలు నాటుతూ వనాలుగా పెంచుతోందన్నారు ఇప్పటికే 7 కోట్ల 76 లక్షల మొక్కలను నాటడం జరిగింది అన్నారు.

బొగ్గు గనుల ప్రారంభం నుండి మూసివేత వరకు, ఆ తదుపరి కూడా మైన్ క్లోజర్ ప్ప్లాన్ లను నిబంధనల ప్రకారం తు.చ తప్పకుండా అమలు జరుపుతున్నామని, యథాస్థితి పర్యావరణ పరిస్థితులకు, సమీప గ్రామాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక చొరవ చూపిస్తుందన్నారు.

సింగరేణి ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే సుమారు 1,205 లక్షల కిలో లీటర్ల నీటిలో కంపెనీ అవసరాలు పోగా మిగిలిన 820 లక్షల కిలో లీటర్ల నీటిని స్థానిక ప్రజల అవసరాల కోసం వినియోగించడం జరుగుతుందని, వీటిలో 465 లక్షల కిలో లీటర్ల నీటిని సమీపంలోని చెరువులు, కుంటలలోకి పంపించడం జరుగుతుందని మిగిలిన 330 లక్షల కిలో లీటర్ల నీటితో స్థానికులు తమ పంట పొలాలను సాగు చేస్తున్నారని తెలిపారు. మొత్తం మీద సింగరేణి సంస్థ అందించే నీటితో 13,625 ఎకరాలలో సేద్యం జరుగుతుందన్నారు.

అలాగే భూగర్భ జలాల పెంపుదల కోసం నీటి బిందువు-జల సింధువు అనే కార్యక్రమాన్ని చేపట్టి 62 కొత్త చెరువులను నిర్మించడం జరిగిందని, 45 పాత చెరువుల్లో పూడిక తొలగింపు చేపట్టామన్నారు. పాత గనులకు సంబంధించిన భవనాలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లను ప్రారంభించడం జరిగిందన్నారు.

మూసివేసిన ఓపెన్ కాస్ట్ గనుల నీటి సంపులలో నీటి నిల్వను కొనసాగించడం ద్వారా సమీప ప్రాంతాలలో భూగర్భ జలాల పెంపుదల సాధ్యమైందన్నారు. సమీప గ్రామాల నిరుద్యోగ యువతకు, మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశ శిక్షణలు ఉచితంగా అందించడం జరుగుతుందని, అలాగే ప్రతీ నెల సమీప గ్రామాల్లో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

సింగరేణిలోని ఖాళీ ప్రదేశాల్లో ఇప్పటికే 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, రెండవ దశ ప్లాంట్లు పూర్తయిన తర్వాత సింగరేణి సంస్థ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా గుర్తింపు పొందనున్నదని పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంప్ ల మీద కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

గనులకు సమీపంలోని గ్రామాలలో వ్యవసాయ అభివృద్ధి కోసం 20 వ్యవసాయ చెరువుల్లో పూడిక తొలగించడం జరిగిందని, సింగరేణి చేపట్టే భారీ ప్లాంటేషన్ పనులు, ఇతర ఔట్ సోర్సింగ్ పనుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

మొత్తం మీద సింగరేణి సంస్థ పర్యావరణానికి కట్టుబడి, స్థానిక ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటిని ఇకపై కూడా కొనసాగించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి- 1 ఓపెన్ కాస్ట్ మూసివేసిన తర్వాత చేపట్టిన పర్యావరణ చర్యలపై ఒక లఘు డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

సింగరేణితో పాటు కోల్ ఇండియా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారు, టాటా స్టీల్ కంపెనీ, వేదాంత, హిందాల్కో, ఎన్ఎండిసి వంటి ఇతర సంస్థలు, కొన్ని విదేశీ సంస్థలు తాము చేపడుతున్న మైన్ క్లోజర్ ప్లాన్ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సదస్సులో ఛైర్మన్ తో పాటు సింగరేణి తరఫున డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు, డైరెక్టర్ ( ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply