- ఎమర్జింగ్ టెక్నాలజీ కాదు… అవకాశాల గని
- ‘మార్పు’ను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ
- గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ
- “తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ప్రారంభోత్సవం”లో మంత్రి శ్రీధర్ బాబు
రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఈరోజు (బుధవారం) టీ హబ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత “తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్(టీజీడెక్స్)” ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
“ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. కొత్తగా ఎన్నో అవకాశాలు సృష్టించింది. ఈ మార్పును అందిపుచ్చుకుని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ & రోడ్ మ్యాప్ ను రూపొందించుకుని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది” అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
దేశంలో తొలి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్…
“ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా… అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్ సీ వ్యూహాత్మక సహకారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్. ఇది కేవలం డేటా ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాత్మకమైన టెక్ పౌరసత్వానికి బలమైన పునాది. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపుతుంది. ఇప్పటికే 480కి పైగా డేటాసెట్స్, 3వేలకు పైగా ఏఐ స్టార్టప్స్ ఇందులో భాగస్వామయ్యాయి” అని చెప్పారు.
ఎవరికీ ప్రయోజనం…
“టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్‌కు డేటా లభిస్తుంది. రోగులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేయొచ్చు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కి ఉపయోగపడుతుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దేలా నూతన ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతుంది. పౌర సేవలను సమర్థవంతంగా ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే దగ్గర సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుంది” అని వివరించారు.
అయిదేళ్లలో 2వేల డేటా సెట్స్…
“టీజీ డెక్స్ లో రాబోయే అయిదేళ్లలో 2వేల డేటా సెట్స్ ను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పాలనలో ఏఐ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నాం. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పాఠశాల స్థాయి నుంచే నిపుణులను తయారు చేసేలా ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులమ్ ను రూపొందించాం” అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, టీ హబ్ సీఈవో కవికృత్, టీ వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు.