కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తన టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. నాలుగు రోజుల సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో టెస్ట్ మ్యాచ్‌ను కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 133 పరుగులకే కుప్పకూలింది, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన శాంటో, ఇది భావోద్వేగ నిర్ణయం కాదని, జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న ముందస్తు నిర్ణయం అని అన్నారు.
నవంబర్ 2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంటో, ఇప్పటివరకు 14 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 4 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రాతో ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతను తన వ్యక్తిగత ఫామ్‌ను మెరుగుపరచుకోవడంలో విజయం సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో కెప్టెన్ శాంటో మొత్తం 300 పరుగులు చేశాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో వరుసగా రెండు సెంచరీలు ఉన్నాయి.
కాగా, నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామాతో అతని స్థానంలో కొత్త టెస్ట్ కెప్టెన్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జూలై 2 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే వన్డే, టీ20 సిరీస్‌లకు బంగ్లాదేశ్ జట్టు సన్నాహాలు ప్రారంభించింది.