హైదరాబాద్, : స్థానిక సంస్థలకు Local Body Elections) గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు (High Court) బుధవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు జస్టిస్ టీ మాధవీదేవి
వివరాలలోకివెళితే నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం ఉదయం తీర్పు ఇచ్చారు..
స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని, పాలకవర్గాల కాలపరిమితి పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలను, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం- 2018 నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం వాయిదా కోరింది.గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటుచేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక ఎన్నికల నిర్వహణకు తమకు రెండు మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు సోమవారం ముగియడంతో బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది.