- మావోల మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
- గురువారం అర్ధరాత్రి సమయంలో గాజర్ల రవి, అంజూల మృతదేహాలు అప్పగించిన పోలీసులు
- శుక్రవారం ఉదయం రావి అరుణ మృతదేహాన్ని బంధువులకు అప్పగింత
చింతూరు, రంపచోడవరం, (ఏఎస్‌ఆర్ జిల్లా) (ఆంధ్రప్రభ ) : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం (Rampachodavaram) పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రంపచోడవరం, దేవిపట్నం, మారేడుమిల్లి మూడు మండలాల సరిహద్దు ప్రాంతాల అడవుల్లోని పాపికొండల అభయారణ్య అటవీ ప్రాంత పరిధిలోని గోదావరి – పాములేరు నది పరివాహక కింటూరు అటవీ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే.
ఈ ఎన్‌కౌంటర్ (Encounter) లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇద్దరి మృతదేహాలను, శుక్రవారం ఉదయం మరో మృతదేహాన్ని పోలీసులు మృతిచెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించారు. దీంతో ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్ కథ మృతదేహల అప్పగింతతో సుఖాంతమై ముగిసింది.

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత…
మన్యంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టులు (Maoists) తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా-ఒడిస్సా రాష్ట్రాల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అలియాస్ బిర్సూ, చత్తీష్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కొంట ఏరియా కమిటీ సభ్యురాలు, ఏసీఎం కొవ్వాసి అంజు అలియాస్ మాసేల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పంచనామా నిర్వహించి రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో బంధువులు, కుటుంబ సభ్యులకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులు, వైద్యాధికారులు కలిసి అప్పగించారు.

శుక్రవారం ఉదయం అరుణ మృతదేహం అప్పగింత…
ఇదిలా ఉంటే గురువారం అర్ధరాత్రి దాటిన ఇద్దరు మృతదేహాల (Dead bodies) ను అప్పగించిన పోలీసులు అరుణ మృతదేహాన్ని కొంచెం ఆలస్యంగా అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి (Pendurthi) మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, ఆంధ్రా-ఒడిస్సా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ అలియాస్ అంకిత అలియాస్ రూప్పి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తండ్రి లక్ష్మణరావు, చెల్లి ఝాన్సీలకు పోలీసులు అప్పగించారు. ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టు కీలక నేతల, అగ్రనేతల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఎన్‌కౌంటర్ కథ సుఖాంతమైంది. పోలీసులు మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించడంతో తమవారి మృతదేహాలను కుటుంబ సభ్యులు తమ తమ స్వస్థలాకు అంబులెన్సుల ద్వారా తీసుకెళ్లారు.

ఛత్తీస్‌గఢ్ లో ఎదురుకాల్పులు…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయ. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలోని చోటే బేటియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు రావడంతో అడవులను జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు బయలుదేరి అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయం కాంకేర్ జిల్లా ఎస్పీ ఐకె ఎల్లిసెల ఎన్‌కౌంటర్ ను ధ్రువీకరించారు. ఈ ప్రాంతంలో పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒక పక్క మావోయిస్టుల బంద్ జరుగుతున్న క్రమంలో ఎన్‌కౌంటర్ జరగడం మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బగానే భావించాలి.