దివంగత నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్థిక పరిస్థితి తెలుసుకుని అతనికి రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) సాయం అందజేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో తనకు ప్రకటించిన రఘుపతి వెంకయ్య అవార్డు, నగదు బహుమతి తీసుకుంటున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ”మీ బహుమతి మొత్తంలో చాలా భాగం వివిధ సేవా కార్యక్రమాలను అందజేస్తాను” అని వేదిక మీదే చెప్పినట్టు యండమూరి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ ప్రకారం కడప ఆర్తి ఫౌండేషన్ (Kadapa Aarti Foundation) కు. రూ.3 లక్షలు, శ్రీకాకుళం సమీప గ్రామంలో నిర్వహిస్తున్న అనాథ విద్యార్థులకు సహయం నిమిత్తం అభయ ఫౌండేషన్‌కు రూ.లక్ష ఇవ్వడం జరిగింది.
నటుడు కాంతారావు కొడుకు రాజా (రాజెశ్వరరావు) అద్దె కట్టడానికి కూడా వెతుక్కునే పరిస్థితిలో ఉన్నాడని తెలిసి, అతడికి రూ.లక్ష ఇవ్వడం జరిగిందని యండమూరి పేర్కొన్నారు. సినీ అవార్డుల్లో కాంతారావు (Kantarao) పేరు మీద ప్రత్యేక అవార్డును, పది లక్షల రూపాయల బహుమతిని నటుడు విజయ్ దేవరకొండకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకను వీక్షించేందుకు కాంతారావు కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఖర్చుల కోసం రూ.వెయ్యి నిర్వాహకులు వారికి పంపించారని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.