Indian Army | డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా రాజీవ్‌ ఘాయ్‌..

ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించింది. ఆయన్ను డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. ఈ విషయాన్ని రక్షణమంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో వెల్లడించింది.

భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం కోసం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (స్ట్రాటజీ) పదవిని సృష్టించినట్లు రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది. ఇది భారత సైన్యంలోని కీలక విధులలో ఒకటిగా ఉంటుందని పేర్కొంది.

డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ బాధ్యతలతోపాటు డీజీఎంవోగానూ ఘాయ్‌ కొనసాగుతారని తెలిపింది. జూన్‌ 4న జరిగిన డిఫెన్స్‌ ఇన్వెస్టిచర్‌ సెర్మనీ 2025లో ఘాయ్‌కి ఉత్తమ యుద్ధ సేవా పతకం లభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత సైన్యం తరఫున మీడియా సమావేశానికి జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ నాయకత్వం వహించారు.

ఇక డీజీఎంవోకి ముందు చినార్‌ కార్ప్స్‌కు జీవోసీగా పనిచేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక మిషన్లలో ప్రధాన భూమిక పోషించారు.

Leave a Reply