రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి కంపెనీ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా అమలు చేస్తున్న రూ.కోటి ప్రమాద బీమా పథకం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి కంపెనీ సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
మణుగూరుకు చెందిన ఈపీ ఆపరేటర్ మూల్ చంద్ విశ్వకర్మ ఇటీవల ప్రమాదంలో మృతి చెందగా.. ఆయన భార్య హరిదేవి విశ్వకర్మకి శుక్రవారం కొత్తగూడెం హెడ్డాఫీసులో రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండీ తన సందేశం ఇచ్చారు.
దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థల్లో లేని విధంగా సింగరేణి సంస్థ తొలిసారిగా బ్యాంకుల వారితో మాట్లాడి గరిష్టంగా రూ.కోటి 25 లక్షలు ప్రమాద బీమా పథకాన్ని అమలు జరపడం జరిగిందని, దీనివల్ల ప్రమాద బాధిత మృతుల కుటుంబీకులకు ఆర్థికంగా గట్టి భరోసా లభిస్తోందన్నారు.
సింగరేణిలో అమలు అవుతున్న ఈ ప్రమాద బీమా పథకాన్ని అసోం, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు కోల్ ఇండియాలో కూడా అమలులోకి తీసుకువచ్చారన్నారు. బీమా రంగంలో విప్లవాత్మక పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వ చొరవ, సింగరేణి ముందడుగే కారణమన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల వరకు ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం(ఐఆర్, పీఎం) కవితా నాయుడు, జీఎం(ఆర్సీ) కుమారి నికోలస్, జీఎం(వెల్ఫేర్) జి.వి.కిరణ్ కుమార్, హెచ్ వో డీ (ఈఈ సెల్) ఎ.జె.ఎం.మురళీధర్, గుర్తింపు, ప్రాతినిథ్య, అధికారుల సంఘం నాయకులు ఎస్వీ రమణ మూర్తి, ఎస్.పీతాంబరరావు, సునీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.