నెల రోజుల్లో 18 మంది అరెస్టు
పట్టుబడిన వారిలో యూట్యూబర్లు, జవాన్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇంజినీర్లు
పాకిస్థాన్‌లోని పలు విభాగాలతో సంబంధాలు
పాక్ దౌత్య కార్యాలయంతో నేరుగా రిలేషన్స్
పెద్ద మొత్తంలో చేతులు మారిన డబ్బు
ఆర్థిక లావాదేవీలు, హనీట్రాప్ ప్రధాన కారణం
మరింతలోతుగా ఎంక్వైరీ చేస్తున్న ఎన్ఐఏ
భద్రతా లోపాలు నిజమేనన్న అమిత్ షా
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో దాదాపు 18 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొన్నాయి. నిందితులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. యూట్యూబర్లు, సీఆర్పీఎఫ్ జవాన్, ప్రభుత్వాధికారి, మెకానికల్ ఇంజినీర్, స్టూడెంట్, మసీదు ఇమామ్, సెక్యూరిటీ గార్డు, వ్యాపారి, టెకీ, హెల్త్ వర్కర్, సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తి ఇట్లా పలు రంగాలకు చెందిన వ్యక్తులు పాక్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్టు అధికారులు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు గుర్తించారు.
డబ్బులు, హనీట్రాప్ కారణాలు..
డబ్బులకు ఆశపడి కొందరు, హనీట్రాప్‌లో పడి మరికొందరు.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్టు విచారణలో వారు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు నుంచే ఈ గూఢచర్యం కొనసాగుతున్నదని, దాన్ని గుర్తించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని నిపుణులు విమర్శిస్తున్నారు.
అరెస్టయిన గూఢచారులు వీళ్లే..
జ్యోతిమల్హోత్రా (యూట్యూబర్)
పాక్‌లో ఇంటెలిజెన్స్ అధికారులను కలిశారు. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనూ పర్యటించారు. ఉగ్రదాడి తర్వాత పాక్ హైకమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తితోనూ ముచ్చట్లు పెట్టారు. 12 టెరాబైట్ల డేటా పాక్‌కు చేర్చినట్టు అనుమానిస్తున్నారు.
మోతీరామ్ జాట్ (సీఆర్పీఎఫ్ జవాన్)
డబ్బులు తీసుకొని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (పీఐవో)కు 2023 నుంచే కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు.
రవీంద్ర వర్మ (మెకానికల్ ఇంజినీర్)
ముంబైలోని ఓ రక్షణ రంగ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2024 నుంచి భారత్‌కు చెందిన యుద్ధనౌకలు, సబ్మెరైన్ల సమాచారాన్ని స్కెచ్‌ల రూపంలో పాక్‌కు చేరవేశాడు.
సహదేవ్‌సింగ్ (హెల్త్ వర్కర్)
ఐఏఎఫ్, బీఎస్ఎఫ్ ఇన్ఫ్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. 2023 నుంచే ఈ కార్యకలాపాలు సాగుతున్నాయి.
దేవేందర్ సింగ్ (పీజీ స్టూడెంట్)
2024 నవంబర్‌లో పాక్‌లో పర్యటించాడు. అప్పుడే భారత సైన్యానికి సంబంధించిన కొన్ని ఫొటోలను పాక్‌కు చేరవేశాడు.
నౌమన్ (సెక్యూరిటీ గార్డు)
హర్యానా సరిహద్దుల్లోని భద్రతాదళాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. ఐఎస్ఐకి మన సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలియచేశాడు. ఆర్మన్, తారిఫ్ అనే మరో ఇద్దరు కూడా ఇదే కేసులో అరెస్టయ్యారు.
షాకూర్ ఖాన్ (ప్రభుత్వాధికారి)
ఏడుసార్లు అనధికారికంగా పాక్‌లో పర్యటించాడు. మెయిల్, వాట్సాప్‌లో కొన్ని ఫైల్స్‌ను డిలీట్ చేశాడు. పాక్ నుంచి కొంత మొత్తంలో డబ్బులు ఈయన ఖాతాకు బదిలీ అయ్యాయి.
కాసీమ్ (సిమ్‌కార్డుల విక్రయదారి)
ఇండియన్ మొబైల్ సిమ్‌కార్డులను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (పీఐవో)కు విక్రయించాడు. ఐఎస్ఐకి కీలక సమాచారమిచ్చాడు.
షాహ్జాద్ (బిజినెస్‌మ్యాన్)
పాక్‌లో పలుమార్లు పర్యటించాడు. అక్రమంగా సరుకును రవాణా చేశాడు. సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు.
ముర్తాజా అలీ (టెకీ)
మన దళాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి పంపించడానికి ఏకంగా ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేశాడు. వీళ్లేకాకుండా యూపీలోని ఓ మసీదు ఇమామ్‌ను, పంజాబ్‌కు చెందిన గజాలా, యామిన్ను కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
జస్బీర్ సింగ్ (యూట్యూబర్)
సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో 11 లక్షల మంది (1.1 మిలియన్) సబ్స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. పంజాబ్‌కు చెందిన జస్బీర్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేష ప్రజాదరణ పొందాడు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు జస్బీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు
గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. జస్బీర్ సింగ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఒక యూట్యూబర్ ఇలా గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ కావడం సోషల్ మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జస్బీర్ సింగ్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణ పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హరూన్ (తుక్కు వ్యాపారి) :
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొంది. ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్‌ను నోయిడాలో అదుపులోకి తీసుకొన్నారు. అతడికి పాకిస్థాన్ దౌత్య కార్యాలయంలోని ముజమ్మల్ హుస్సేన్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఇతడు వీసా కోసం డబ్బులు, ఇతర సున్నిత సమాచారం చేరవేయడంతోపాటు.. తీవ్రవాద భావజాల వ్యాప్తికి పాల్పడుతున్నట్లు అనుమానం.
పాక్ దౌత్య సిబ్బందితో సంబంధాలు..
హరూన్‌కు పాక్ దౌత్య సిబ్బంది అయిన ముజమ్మిల్‌తో బలమైన సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వారు నిత్యం కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. హరూన్‌కు పాకిస్థాన్‌లో బంధుత్వాలు ఉండటంతో.. ముజమ్మిల్ వీసాలను ఇప్పించినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక హరూన్ పాక్ వీసాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి వివిధ బ్యాంకు ఖతాల్లో జమ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సొమ్ములో కొంత కమిషన్ తీసుకొని.. ముజమ్మిల్ చెప్పిన వ్యక్తులకు మిగిలిన మొత్తం ఇచ్చేవాడు. అతడు పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిసినా.. హరూన్ సహకరించాడని ఏటీఎస్ బృందం చెబుతోంది. దీంతో సున్నితమైన సమాచారం చేరవేసి ఉండొచ్చని సమాచారం. ఇటీవలే ప్రభుత్వం ముజమ్మిల్ హుస్సేన్‌ను అనుమానిత వ్యక్తిగా ప్రకటించిన భారత్.. అతడిని స్వదేశానికి తిరిగి పంపింది.
తుఫేల్ (వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం)
ఆదంపుర్, వారణాసీల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో ఏటీఎస్ బృందం తుఫేల్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు దేశ వ్యతిరేక వాట్సాప్ గ్రూప్‌లో చేరినట్లు గుర్తించారు. దీనిని పాకిస్థాన్‌లోని సంస్థలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు అతడు సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందించినట్లు గుర్తించారు. ‘‘తుఫేల్ పాకిస్థాన్‌లోని వ్యక్తులు, సంస్థలతో సంబంధాలు నెరుపుతున్నారు. పాక్‌లో నిషేధానికి గురైన తెహ్రీక్ ఎ లబ్బేక్ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా షాద్ రిజ్వీ వీడియోలను తరచూ షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. గజ్వా ఎ హింద్‌కు సంబంధించిన కంటెంట్‌ను అతడు ప్రమోట్ చేస్తున్నాడు. భారత్‌లో షరియా చట్టం తీసుకురావడం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నాడు.
దాదాపు 600 మందితో సంబందాలు..
వారణాసిలోని రాజ్‌ఘాట్, నమోఘాట్, జ్ఞానవాపీ మసీదు, వారణాసీ రైల్వేస్టేషన్, జామా మసీద్, ఎర్రకోట, నిజాముద్దీన్ ఫొటోలను పాక్ వ్యక్తులకు షేర్ చేశాడు’’ అని ఏటీఎస్ వెల్లడించింది. అతడికి పాకిస్థాన్‌లోని దాదాపు 600 మందితో సంబంధాలు ఉన్నాయి. ఇక ఫైసలాబాద్‌లోని నఫీస అనే మహిళతో కూడా అతడు సంభాషిస్తున్నాడు. ఆమె భర్త పాక్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ రెండు కేసులపై వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రవీంద్ర వర్మ (గూఢచారి ఇంజినీర్ అరెస్ట్) :
రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్న రవీంద్ర వర్మ (27)ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనను యాంటీ టెర్రరిజం స్కాడ్ కస్టడీకి అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం, థానేలోని కల్యాణికి చెందిన రవీంద్ర వర్మకు 2024లో ఫేస్బుక్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లు పాయల్ శర్మ, ఇస్ప్రీత్లతో పరిచయమైంది. వారిద్దరూ తాము భారత్‌కు చెందినవారమని పరిచయం చేసుకున్నారు. ఓ ప్రాజెక్టు కోసం యుద్ధ నౌకల సమాచారం కావాలని వర్మను కోరారు. వర్మ వారి వలపు వలలో చిక్కుకున్నాడు. దక్షిణ ముంబైలోని నావల్ డాక్ యార్డుకు వెళ్లేందుకు, నౌకాదళ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో ప్రయాణించేందుకు ఆయనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసి, యుద్ధ నౌకలతోపాటు జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆ పాక్ ఏజెంట్లకు చేరవేశాడు. అందుకు బదులుగా వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పొందాడు.