60 ఏండ్లుగా జనాలకు దూరంగా ఆదిమజాతీవాసులు
కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే నివాసం
సెంటినలీస్ అంటే ఎవరు?
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీ లైన్ ఇదే..
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సరికొత్త అంశంతో వచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా “మైగ్రేషన్” టాపిక్ డిస్కస్ చేసిన ఆయన.. అందులో “సెంటినల్ ఐలాండ్” గురించి వివరించారు. అక్కడ నివసిస్తున్న జనాలు 60,000 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారని, కొత్తవారు అడుగు పెడితే చంపేస్తారని చెప్పారు. దీంతో సెంటినల్ ఐలాండ్ గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకు తెలుసా? లేకుంటే ఈ స్టోరీ చదివేయండి.
- సినిమా డెస్క్, ఆంధ్రప్రభ
ఆదిమకాలం తర్వాత మానవుడు వలస జీవన విధానాన్ని అలవర్చుకున్నాడు. ఆహార అన్వేషణలో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ జీవించేవాడు. ఆ తర్వాత క్రమంలో వ్యవసాయం, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న దగ్గర్నుంచి నేడు అంతరిక్ష యానం చేసేదాకా పరిణామం చెందాడు. అయితే.. ఒక తెగ మాత్రం 60 వేల సంవత్సరాల క్రితం ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించిందో, ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతోంది! అదే “సెంటినలీస్”. ఈ తెగ మనదేశ పరిధిలోనే ఉంది! అవును, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న “నార్త్ సెంటినల్ ఐలాండ్”లో నివసిస్తోంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ లేకుండా పూర్తి సెపరేట్ గా జీవిస్తోంది.
కేవలం 64 కిలో మీటర్ల దూరంలో :
బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమూహంలో ఉన్న ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్, అండమాన్ కేపిటల్ పోర్ట్ బ్లెయిర్ నుంచి కేవలం సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీపంలో ఒకే ఒక గిరిజన తెగ నివసిస్తోంది. దానిపేరు సెంటినలీస్. వీరు సుమారు 60 వేల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా బతుకుతున్నారు. అంటే వారి జీవన విధానం అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
అడుగు పెడితే ఖతమే!
చరిత్ర పూర్వ యుగంలో వలస జీవన విధానం సాగుతున్న సమయంలో జనాలు గుంపులుగా, తెగలుగా జీవించేవారు. ఈ క్రమంలో ఒక తెగ మరో ప్రాంతానికి వెళ్తే, తమ భూభాగం ఆక్రమణకు గురికాకుండా అక్కడి వారు ప్రతిఘటించేవారు. ఈ క్రమంలో యుద్ధాలు చేసేవారు. సెంటినలీస్ తెగకు చెందినవారు ఇప్పటికీ అదే ఆలోచనా విధానంతో ఉన్నారు. ఎవరైనా తమ ప్రాంతానికి వెళ్తే దండెత్తినట్టుగానే భావిస్తూ వారిపై యుద్ధానికి దిగుతారు. తమ ద్వీపానికి సమీపంగా ఎవరు వచ్చినా సరే, దాడిచేసి చంపేస్తారు. చరిత్రలో చాలా మంది ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని సమాచారం. వీరిలో అనేకమంది మత్స్యకారులు కూడా ఉన్నారని అంచనా.
భారత ప్రభుత్వ చర్యలు :
సెంటినలీస్ తెగ అత్యంత అరుదైనదిగా గుర్తించిన భారత ప్రభుత్వం, ఆ తెగ రక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. నార్త్ సెంటినెల్ దీవిని “గిరిజన పరిరక్షణ ప్రాంతం”గా ప్రకటించింది. ఈ మేరకు ఈ మేరకు 1956లో ఒక గెజిట్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఆ దీవి నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ ప్రవేశించడానికి వీళ్లేదు. అంటే సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్నవారు నిషేధిత ప్రాంతం దాటి లోనికి వెళ్లడానికి అనుమతి లేదన్నమాట. అక్కడి తెగ జీవన విధానానికి ఆటంకం కలగకుండా చూడడం మాత్రమే కాకుండా, ఇతర ప్రపంచంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా జీవించాలనే వారి హక్కును గౌరవించడం, కాపాడడం కూడా ఇందులో భాగమే.
కోస్ట్ గార్డ్ గస్తీ :
ఇక్కడ ఇండియన్ కోస్ట్ ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన పరిధి దాటి ఇతరులు ఎవరూ సెంటినల్ ఐలాండ్ వైపు వెళ్లకుండా చూస్తూ ఉంటుంది. తీర ప్రాంత రక్షణతోపాటుగా వీరి రక్షణ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుంది.
వ్యాధుల ముప్పు :
సెంటినల్ ఐలాండ్ వైపు ఆధునిక మానవులు ఎవరూ చేరుకోకూడదనే ఆదేశాల వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నాగరిక ప్రపంచంపై “ప్లేగు” మొదలు, నేటి కరోనా వరకూ ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు దాడిచేశాయి. కోట్లాది మందిని బలిగొన్నాయి. ఇవేకాకుండా మరెన్నో రకాల అంటు వ్యాధులు ఇప్పటికీ ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. వాటిని తట్టుకుంటూ, అధిగమిస్తూ ఆధునిక మానవుడు ముందుకు సాగుతున్నాడు. ఆ మేరకు రోధనిరోధక శక్తిని సాధించాడు. అందుకు అధునాతన వైద్య విధానాలు కూడా సహకరిస్తున్నాయి. కానీ, సెంటినల్ ఐలాండ్‌లోని గిరిజనులు ప్రకృతితో మమేకమైన వారు. వారికి మోడ్రన్ జీవన విధానంతో టచ్ లేనట్టుగానే, ఈ ప్రపంచంలోని వ్యాధులతోనూ పరిచయం లేదు. ఇలాంటి వ్యాధులు గనక వారికి సంక్రమిస్తే తట్టుకునేంత రోగ నిరోధక శక్తి వారికి ఉండదని పరిశోధకులు, నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఈ రోగాలు వారి జాతినే సమూలంగా నాశనం చేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటి ప్రపంచంలో పుట్టే రోగాలు, ఇతర ప్రమాదాలు కూడా వారి దరిచేరకుండా చూడడం కోసం కూడా ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించారు.
ఐలాండ్ లో ఎంత మంది ఉన్నారు?
ప్రస్తుతం సెంటినల్ ఐలాండ్ లో ఎంత మంది ఉన్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. సుమారు 500 లోపు ఉండొచ్చని అంచనా. ఇక వీరి జీవన విధానం ఎలా ఉంటుంది? ఏ భాష మాట్లాడుతారు? ఆహారపు అలవాట్లు ఏంటి? కుటుంబ వ్యవస్థ కొనసాగుతోందా? ఆచార వ్యవహారాల సంగతేంటి? వంటి విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా తక్కువగానే ఉంది.
జీవన విధానం :
ఆఫ్రికా నుంచి మొదలైన మానవజాతి సంచార జీవనం మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, భారత్ మీదుగా శ్రీలంక, ఆస్ట్రేలియా దాకా కొనసాగిందని మెజారిటీ చరిత్రకారులు, పరిశోధకులు ఏకీభవిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు అలా సాగిన ప్రయాణం క్రమంగా తగ్గుముఖం పట్టింది. వ్యవసాయం కనుగొన్న తర్వాత స్థిర నివాసం వేగం పుంజుకుంది. ఈ క్రమంలో సెంటినల్ ఐలాండ్‌లోని గిరిజనులు కూడా స్థిరనివాసమైతే ఏర్పాటు చేసుకున్నారు కానీ, ఆ తర్వాత కాలంలో ఆధునిక ప్రపంచంలో వచ్చిన మార్పులేవీ వారు అనుసరించలేదు. ఇంకా చెప్పాలంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా వారికి తెలియలేదు. తెలుసుకోవాలని వారు భావించలేదు కూడా! అందుకే వారు ఇప్పటికీ ఆదిమ జీవన విధానాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి ఇప్పటికీ వ్యవసాయం చేసే అవకాశం లేదని పరిశోధకులు భావిస్తున్నారు. వేట ద్వారా మాంసాహారాన్ని, చెట్ల నుంచి పండ్లు, దుంపలు వంటివి ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఇక, వీరి ఆయుధాల విషయానికి వస్తే సంప్రదాయ బాణాలు, ఈటెలు, రాళ్లు వంటివి మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. వీరి నివాసాలు మనకు పూర్తి భిన్నంగా ఉంటాయని సమాచారం. మనం ఉమ్మడి కుంటుంబం నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వరకు వచ్చాం. వారు మాత్రం ఇంకా సమూహాలుగానే నివసిస్తున్నారని అంచనా. అందువల్ల అందరికీ సరిపడా పెద్దవైన సామూహిక గుడిసెలను, గోడలు వంటివి లేని తాత్కాలిక ఆశ్రయాలను నిర్మించుకున్నారని భావిస్తున్నారు. ఈ రెండు రకాల నివాసాలే వారి ఆవాసాలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నప్పటికీ, దాని రూపం గురించి సరైన అవగాన లేదు.
అండమాన్ దీవుల్లో మరికొన్ని తెగలు :
అండమాన్ నికోబార్ పరిధిలో మొత్తం 572 దీవులు ఉన్నాయి. వీటిల్లో జనావాసాలుగా ఉన్నవి కేవలం 37 మాత్రమేనని ఆధికారికంగా గుర్తించారు. మిగిలినవన్నీ మానవులు లేని దీవులు. ఈ దీవుల్లో సెంటినలీస్ మాత్రమే కాకుండా మరికొన్ని తెగలు కూడా నివసిస్తున్నాయి. వీరి వివరాలు చూస్తే..
అండమానీస్ : వీరినే గ్రేట్ అండమానీస్ అని కూడా అంటారు. వీరు గతంలో అండమాన్ దీవులన్నింటిలో విస్తరించి ఉన్నారు. కాల క్రమంలో వీరి సంఖ్య తగ్గిందని తెలుస్తోంది. ఇప్పుడు వీరి మెజారిటీ స్ట్రెయిట్ దీవి (Strait Island)లో నివసిస్తోంది. భారత ప్రభుత్వం వీరికి పునరావాసాలను సైతం ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఈ అండమానీస్ దాదాపుగా వరకు బాహ్య ప్రపంచంతో కలిసిపోయారు.
నికోబారీస్ (Nicobarese) : అండమాన్ నికోబార్ దీవుల్లోని అతిపెద్ద గిరిజన తెగ ఇదే. దాదాపు 12 దీవుల్లో వీరు నివసిస్తున్నారు. “కార్ నికోబార్” వీరి ప్రధాన కేంద్రం. వీరు వ్యవసాయం చేస్తారు. పశుపోషణ, ఇంకా చేపల వేట వంటి పనులతో జీవిస్తుంటారు. ఒకరకంగా వీరిది కూడా సాధారణ జీవనమే.
ఒంగేస్ (Onges) : ఈ తెగవారు డ్యూగాంగ్ క్రీక్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఇది లిటిల్ అండమాన్ దీవిలో ఉంటుంది. ఈ తెగ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
జరావాస్ (Jarawas) : వీరు సౌత్, మిడిల్ అండమాన్ దీవుల్లో, వెస్ట్ బ్యాంక్‌లోని దట్టమైన అడవుల్లో జీవిస్తున్నారు. వీరు బాహ్య ప్రపంచంతో చాలా చాలా తక్కువ సంబంధాలు కలిగి ఉన్నారు. వీరి నివాస ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం బఫర్ జోన్‌గా ప్రకటించింది. వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది.
షోమ్ పెన్స్ (Shom Pens) : వీరు “గ్రేట్ నికోబార్ దీవి” లోని దట్టమైన అటవీ ప్రాంతాల మధ్యలో నివసిస్తున్నారు. బయటి ప్రపంచంతో వీరికి కొద్దిగా మాత్రమే సంబంధాలు ఉన్నాయి. వీరు సంప్రదాయ జీవన విధానాన్నే పాటించడానికే ఇష్టపడతారు.
ఈ విధంగా ప్రధానమైన 6 తెగల గిరిజనులు అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారు. బయటి ప్రపంచంతో పూర్తిగా, పాక్షికంగా, అతి స్వల్పంగా సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ, ఆధునిక ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా, వేల సంవత్సరాల నాటి జీవన విధానానికే అలవాటు పడిన భారతదేశ పరిధిలోనివారు “సెంటినలీస్” మాత్రమే అంటున్నారు పరిశోధకులు.
ప్రపంచ వ్యాప్తంగా :
సెంటినలీస్ లాంటి తెగలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయని చెబుతారు. వీటిని “అన్‌కాంటాక్టెడ్ ట్రైబ్స్” అని పిలుస్తారు. వీరు ఎక్కువగా బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, పెరు వంటి దేశాల పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో, ఇంకా గినియా దీవుల్లో జీవిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా చూసుకున్నప్పుడు ఇలాంటి తెగలు 100 నుంచి 150 వరకు ఉండొచ్చని అంచనా. పెరు పరిధిలోని “మాష్కో-పిరో”, బ్రెజిల్ పరిధిలోని “అవా” తెగలు ఇందుకు ఉదాహరణలు. ఈ తెగలను సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వాలు, ప్రపంచంలోని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.