GT vs LSG | గుజ‌రాత్ పై ల‌క్నో ఘ‌న విజ‌యం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్లేఆఫ్స్ కి ఇప్పటికే దూరం అయిన‌ ముందు, లక్నో సూపర్ జెయింట్స్ నేటి మ్యాచ్ లో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్ పై ఘ‌న విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ లో విజృంభించిన ల‌క్నో.. అనంత‌రం బౌలింగ్ లోనూ హవా చూపించింది.

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన ల‌క్నో.. దంచికొట్టింది. మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117 పరుగులు), ఐడెన్ మార్క్రమ్ (36) కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం అందించారు.

మిచెల్ మార్ష్ తన తొలి ఐపీఎల్ శతకాన్ని సాధించగా, నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రిషభ్ పంత్ కేవలం 6 బంతుల్లో 16 పరుగులు చేసి స్కోరు బోర్డును వేగంగా పెంచాడు. దీంతో ల‌క్నో జ‌ట్టు9 20 ఓవర్లలో 235/2 భారీ స్కోరు నమోదు చేసింది.

ఇక ఛేజింగ్ కు దిగిన గుజ‌రాత్.. ప్రారంభంలో బాగానే ఆడింది. అయితే ల‌క్నో పేస‌ర్ ఓ’రూర్క్ సాయ్ సుధర్శన్‌ను 21 పరుగుల వద్ద ఔట్ చేసి తొలి ఎదురుదెబ్బ కొట్టాడు. ఆ త‌రువాత గిల్ (35), బట్లర్ (33) లు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

ఆ త‌రువాత వ‌చ్చిన‌ షారుఖ్ – రుదర్‌ఫోర్డ్ పోరాటం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. షారుఖ్ ఖాన్ (57) ఆక‌ట్టుకోగా.. షెర్ఫేన్ రుదర్‌ఫోర్డ్ తో కలిసి నాలుగో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కానీ రదర్‌ఫోర్డ్ ఔటైన తర్వాత మ్యాచ్ పూర్తిగా ల‌క్నో వైపు మ‌ళ్లింది.

షారుఖ్ – రుదర్‌ఫోర్డ్ త‌రువాత వ‌చ్చిన ఏ బ్యాట‌ర్ కూడా రెండంకెల ప‌రుగులు సాధించ‌లేదు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. ఫ‌లితంగా ల‌క్నో జ‌ట్టు 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ల‌క్నో బౌల‌ర్ల‌లో… యార్క‌ర్ల‌తో గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌ల‌ను ఇబ్బందిపెట్టిన విల్ ఓ’రూర్క్ 3 కీలక వికెట్లు తీసి గేమ్ టర్న్ చేశాడు. ఆవేష్ ఖాన్, ఆయుష్ బ‌దోని రెండేసి వికెట్లు తీయ‌గా.. ఆకాష్ సింగ్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.

Leave a Reply