హైదరాబాద్ – భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమేనని అన్నారు. దేశ అభ్యున్నతి కోసం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన కృషిని ఎన్నటికీ మరిచిపోలేమని అన్నారు . రాజీవ్ గాంధీ దేశ ఆర్థిక, సాంకేతిక, యువజన సాధికారత రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు.
గాంధీ కుటుంబం త్యాగాలను తిరస్కరించలేరు..
రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాయని, 18 ఏళ్ల వయస్సు నుంచి యువతకు ఓటు హక్కు కల్పించి ప్రభుత్వ ఏర్పాటులో వారి భాగస్వామ్యాన్ని పెంచారని రేవంత్ అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ఆధునికీకరణకు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు. సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ఇదివరకు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తీసేస్తామని అన్నారని ప్రస్తావించారు. ఈ విమర్శలను తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేశారంటూ.. గాంధీ కుటుంబ చరిత్రను గుర్తు చేశారు. “సంకుచిత మనస్తత్వంతో కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారు. కానీ, దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం గొప్పతనాన్ని ఎవరూ తిరస్కరించలేరు’’ అన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాదం ముసుగులో వచ్చిన వాళ్ళను నియంత్రించారు ఇందిరా గాంధీ. పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం కోసం వచ్చింది. మీకు తెల్లరంగు ఉందని… అజమాయిషీ అవసరం లేదని చెప్పారు. పహల్గం సంఘటన తర్వాత మోడీకి మద్దతుగా నిలబడ్డాం.. రాహుల్ గాంధీ, ఖర్గే, దేశ ప్రజలు మోడీకి అండగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కేంద్రం అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి లొంగిపోయింది. వచ్చిన అవకాశం చేజార్చుకున్నారు మోడీ.. ట్రంప్ కి తలొగ్గారు మోడీ.
రాహుల్ గాంధీనీ నిందించి.. చేతగాని తనం బయట పెట్టుకున్నారు.. కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. పహల్గం ఘటనకు అండగా మొదట బయటకు వచ్చింది మేము.. అప్పుడు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.. మీ గొప్పలు చెప్పుకోండి.. మీ చేతగాని తనం కప్పిపుచ్చుకోవడం కోసం రాహుల్ గాంధీ పై నిందలు వేయడం మానుకో.. గాంధీ కుటుంబం దేశం కోసం రక్తం ఇచ్చారు.. రాజీవ్ గాంధీ విగ్రహంపై సంకుచిత స్వభావంతో మాట్లాడారు.. వాళ్ళ గురించి ఏం మాట్లాడం.. దేశం ఇప్పుడు.. ఇందిరా గాంధీ… రాజీవ్ గాంధీలను గుర్తు చేసుకున్నారు.. దేశ సమగ్రత విషయంలో కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.