PSLV c61 | రేపే నింగిలోకి రీశాట్ 1 బి ఉప‌గ్ర‌హం – షార్ లో కౌంట్ డౌన్ స్టార్ట్…

శ్రీహ‌రికోట – దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి, దేశ భద్రతను పటిష్ఠం చేసే అత్యాధునిక రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం రీశాట్‌-1బీ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సీ61 ద్వారా ఈఓఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. జనవరిలో రోదసిలోకి పంపిన ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్ష్యలోకి వెళ్లలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పీఎస్‌ఎల్‌వీ-సి61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు.

ఆదివారం ఉదయం 5:59 గంటలకు ప్రయోగం..

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభమైంది. 22 గంటలపాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది.

నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తి చేసుకుని ప్రయోగ వేదికపైనున్న పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌కు శాస్త్రవేత్తలు శుక్రవారం తుది పరీక్షలు నిర్వహించారు. ఇక, పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ నమూనాను ఇస్రో చైర్మన్‌ నారాయణన్ శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని నారాయణన్‌ శాస్త్రవేత్తలతో కలిసి దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉప‌గ్ర‌హం ప్ర‌త్యేక‌త‌లు –
రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) ప్రత్యేకత. ఈ రాడర్‌ సహాయంతో పగలు, రాత్రి.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని హై-రిజల్యూషన్ చిత్రాలను తీసి పంపుతుంది. ఇటీవల భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. దేశ భద్రత, సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలకం కానుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా నిశితంగా పరిశీలించి.. హై రిజల్యూషన్‌ ఫొటోలను తీసి పంపుతుంది.

Leave a Reply