హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. అక్కడ నుంచి గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద త్యాగధనులకు ఘనంగా నివాళులర్పించారు కెటిఆర్. ఇక ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలల వేసి అంజలి ఘటించారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ , ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి.. మూలస్తంభాలు. ఈ మొత్తం 25 ఏళ్ల ప్రస్థానానికి, వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణం. 25 సంవత్సరాల క్రితం, ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో, కేసీఆర్ సారథ్యంలో మా పార్టీ పురుడు పోసుకుంది. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, లక్షల మందితో బలోపేతమై, తెలంగాణను సాధించింది. పార్టీ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉంది. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి, కొండంత అండగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ వినమ్ర నివాళి. మా పార్టీ కి, ఆనాడైనా ఈనాడైనా, తెలంగాణనే ఏకైక ఎజెండా . తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోంది. .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నాం. 25 సంవత్సరాలు నిండి, అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో, మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాం అని కెటిఆర్ పేర్కొన్నారు.