Pakistan | దేనికైనా రెడీ.. చూసుకుందాం : పాక్ ప్రధాని సమరోత్సహం…

భార‌త్ దాడులు చేస్తే స‌మ‌ర్ధంగా ఎదుర్కొంటాం
ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు స‌రికాదు
స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించుకోవాలి
పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు సిద్ధం
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ష‌రీఫ్

ఇస్లామాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : భార‌త్ నుంచి ఎటువంటి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ష‌రీఫ్ స్ప‌ష్టం చేశారు.. ఇదే సంద‌ర్బంగా ప‌హల్గాం దాడి ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, శాంతికే త‌మ‌ ప్రాధాన్యం’’ అని అన్నారు. క‌శ్మీర్ లో ఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తూ.. భారత్ తమపై నిందారోపణలు చేస్తోందని అన్నారు. పహల్గామ్ ఘటన విషాదకరమని అంటూనే భారత్ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈమేరకు ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏక ప‌క్ష చ‌ర్య‌ల‌కు ఖండ‌న
భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను షెహబాజ్ తప్పుపట్టారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమని ప్రకటించారు. ‘‘పహల్గామ్ లో జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది అని షరీఫ్‌ తెలిపారు.

ఎలాంటి ముప్పునైనా ఎదుర్కుంటాం..
ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదలబోమని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపైనా షెహబాజ్ స్పందించారు. పాకిస్థాన్ సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమని, ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం వంటి చర్యలతో భారత్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు షెహబాజ్ చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ముగింపు పలకాలన్నారు. బాధ్యతాయుతమైన దేశంగా తమ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Leave a Reply