నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 24, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు వెళ్లే దారిలో నల్లమల ఘాట్ రోడ్ లో గురువారం ప్రైవేటు బస్సు ముందు టైర్లు పేలి కొండను ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. టూరిస్ట్ బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో 22మందికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 108 వాహనంలో క్షతగాత్రులను వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ఆ టూరిస్టు బస్సులో 37మంది ప్రయాణికులు ఉన్నారన్న సమాచారం ఉంది. బళ్లారి నుంచి కర్నూలు, ఆత్మకూరు దోర్నాల మీదుగా చిన్నారి కట్ల సమీపం దగ్గరికి వచ్చేసరికి టూరిస్ట్ బస్సు ముందు టైర్లు పేలిపోయాయి. దీంతో డ్రైవర్ కంట్రోల్ చేసినప్పటికీ టూరిస్ట్ బస్సు కంట్రోల్ కాకపోవడంతో కొండను ఢీకొట్టింది. ప్రయాణికులంతా బళ్లారి, ఆదోని, ఎమ్మిగనూరు వాసులకు చెందినవారుగా ఉన్నారు. బస్సు కొండను ఢీకొట్టిన సంఘటనలో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.
వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్ళిపోయారు. ప్రయాణికులను 108 వాహనాల్లో శ్రీశైలంలో సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్, శ్రీశైలం సీఐ చంద్రబాబులు తెలిపారు.