వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటారు.. ఈ ఫలితాల్లో పల్నాడు ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించి అదరగొట్టింది. ఆ రెండు మార్కులు ఎందులో తగ్గాయంటే హిందీ, ఇంగ్లీష్ లో. ఈ రెండు సబ్జెక్ట్స్ లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. 598 మార్కులు సాధించిన పావని చంద్రికపై ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో మురిసిపోతున్నారు.
కాగా, విద్యార్థిని పావని చంద్రికని జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థిని పావని చంద్రిక, ఆమె తల్లిదండ్రులు, పాఠశాల హెచ్ ఎం లను పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ చంద్రకళ.
ఈ సందర్భంగా విద్యార్థిని పావని చంద్రిక మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాలలో నాకు 598 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది.. నాకు ఈ మార్కులు రావడానికి మాటీచర్లు, స్కూల్ హెచ్ ఎం కృషి చేశారు.. మా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కానీ అమ్మమ్మ ఎంతో జాగ్రత్త తీసుకుని చదివించింది.. భవిష్యత్తులో నేను ఐఎఎస్ కావాలని అనుకుంటున్నాను.. ఐఏఎస్ చదవడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపింది.
ఇక అన్నమయ్య పెద్దవీడు, ప్రకాశం ఆలకూరపాడు జెడ్పీ స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా రికార్డ్ మార్కులు సాధించిన విద్యార్థులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మార్కులు సాధించడంతో మంత్రి నారా లోకేష్ ఆ విద్యార్ధులను అభినందించారు.
కాగా, కాకినాడ ప్రైవేటు స్కూలు విద్యార్ధిని నేహాంజని ఏకంగా 600కు 600 మార్కులు సాధించి ఔరా అనిపించింది