History | ఉగ్ర‌వాద మార‌ణ‌హోమం – 55 ఏండ్ల‌లో 12 వేల‌ దాడులు

టెర్ర‌ర్ అటాక్‌లో 20వేల మంది మృతి
1980లో తొలి న‌ర‌మేధం
త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌ల స‌మీపంలో ఘ‌ట‌న‌
500 మంది బెంగాలీల‌పై ఘాతుకం
ఉమ్మ‌డి ఏపీలోనూ ఉగ్ర‌ఘాత‌కం చ‌ర్య‌లు
క‌ర్నూలు జిల్లాలో రైలు ప‌ట్టాల తొలిగింపు
ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డ్డ ల‌ష్క‌రే కుట్ర‌
పహ‌ల్గామ్ ఘ‌ట‌న‌తో మ‌రోసారి యాదిలోకి
అమ‌రుల‌ను గుర్తు చేసుకుంటున్న జ‌నం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్రప్ర‌భ : అఖండ భారతంలో గడచిన 55 ఏళ్ల ఉగ్రమూకల దుశ్చర్యల చరిత్రలో.. ఇప్పటికి 12,002 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 20,052 మంది చ‌నిపోయారు. 30,574 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1980లో తొలి నరమేధం చోటుచేసుకుంది. త్రిపుర రాజధాని అగర్తలకు సమీపంలోని మండైలో అత్యంత తీవ్ర మారణహోమం జరిగింది. 1980 జూన్ 8వ తేదీన బెరామురా కొండవాలులోని చంపక్ నగర్‌లో తలదాచుకున్న 500 మంది బెంగాలీలను త్రిపుర ఉగ్రవాదులు చుట్టుముట్టి చంపేశారు. ఆ త‌ర్వాత‌ ఇంత పెద్దస్థాయిలో మారణ హోమం చోటు చేసుకోలేదు. 2006 జులై 11వ తేదీన ముంబ‌యిలో ఏడు రైళ్లను దహనం చేసి 209 మందిని ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్నారు. 2008లో ముంబ‌యిలో లష్కరే తొయిబా దాడిలో 171 మంది అమరులయ్యారు. ఇక.. పుల్వామాలో 47 మంది సైనికుల ప్రాణాలు బలితీసుకున్నారు. ఇక‌.. నిన్న క‌శ్మీర్‌లోని పెహ‌ల్గామ్‌లో ఎంజాయ్ చేయ‌డానికి వ‌చ్చిన‌ టూరిస్టుల‌పై ఉగ్ర‌మూక‌లు తుపాకీ గ‌ర్జించింది. ఈ ఘ‌ట‌న‌లో 30 మంది చ‌నిపోయారు. ఇట్లా భార‌త్‌లో 55 ఏళ్లుగా ఉగ్ర మారణహోమం కొనసాగుతూనే ఉంది.

అభవిక్త ఆంధ్రాలో తొలి ఉగ్ర కుట్ర..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2002, డిసెంబర్ 21వ తేదీన ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. 80 మంది గాయపడ్డారు. సాధార‌ణంగా దీన్ని రైలు పట్టాలు తప్పిన ఘటనగానే అంద‌రూ భావించారు. కానీ, ఇదొక ఉగ్ర కుట్ర అని తెలిసినా.. సూత్రధారులు, పాత్రదారులు ఎవరో తెలియలేదు. ఇది జరిగిన 13 నెలలకు లష్కరే తొయిబా ఏజెంటు సయ్యద్ అబ్దుల్ నయీమ్ అసలు విషయాన్ని బయటపెట్టాడు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

కాచిగూడ-బెంగళూరు సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 1:00 గంటకు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది, అకస్మాత్తుగా రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్, ఏడు బోగీలు ట్రాక్ నుంచి పడిపోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. 20 మంది మరణించారు. దాదాపు 80 మంది గాయపడ్డారు, సమీపంలోని గూటి పట్టణంలో ఆసుపత్రికి 30 మంది క్షతగాత్రులను తరలించారు. తొలుత ప్రమాదానికి కారణం తెలియలేదు. ఆర్పీఎఫ్ వైఫల్యంగా అనుమానించారు. కానీ, దర్యాప్తులో రైలు పట్టాను కోసిన బ్లేడ్, ఒక వస్త్రం ఘటనా స్థలిలో దొరికాయి. పథకం ప్రకారం కొన్ని రోజులుగా ఈ కుట్ర జరిగిందని గుర్తించారు. అప్పటికే దేశవ్యాప్తంగా రైళ్ల మార్గాల విధ్వంసమే లక్ష్యంగా 100 దేశీయ ఉగ్రవాద గ్రూపులు పని చేస్తున్న విషయాన్ని బేరీజు వేసుకున్నారు. ఇదొక ఉగ్ర మూక కుట్రగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి జరిగిన 13 నెలల తర్వాత, హైదరాబాద్‌లో పోలీసులు లష్కరే తోయిబా కార్యకర్త సయ్యద్ అబ్దుల్ నయీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు, ‘బ్రెయిన్‌వేవ్ ఫింగర్‌ ప్రింటింగ్ పరీక్షస‌లో ఇత‌ను దొరికిపోయాడు. ఈ రైలు విధ్వంసం, సాయిబాబా ఆలయంలో ఇద్దరు భక్తులను హతమార్చిన బాంబు దాడిలో న‌యీమ్ కీలకపాత్రధారిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

గడచిన పాతికేళ్లల్లో ఉగ్ర నరమేధం

= మార్చి 2000.. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌ పొర గ్రామంలో మార్చి 21న‌ దాడి జరిగింది. రాత్రి సమయంలో సిక్కు వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు..

= ఆగస్టు 2000 : అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని నున్‌వాన్‌ బేస్‌ క్యాంప్‌పై ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. యాత్రికులు సహా మొత్తం 32 మంది చ‌నిపోయారు.

= జులై 2001: మరోసారి అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేశారు. అనంత్‌నాగ్‌లోని శేష్‌నాగ్‌ బేస్‌ క్యాంప్‌పై దాడిలో 13 మందిని పొట్టనపెట్టుకున్నారు.

= అక్టోబర్‌ 2001: శ్రీనగర్‌లోని జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ కాంప్లెక్స్‌పై అక్టోబర్ 01న ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

= 2002: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా చందన్‌వాడీ బేస్‌ క్యాంప్‌పై ముష్కరులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 11 మంది చనిపోయారు.

= నవంబర్‌ 2002: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై దక్షిణ కశ్మీర్‌లోని లోయర్‌ ముండా ప్రాంతంలో నవంబర్ 23న ఐఈడీ పేలుడులో 19 మంది చనిపోయారు. మృతుల్లో 9 మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు.

= మార్చి 2003: పుల్వామా జిల్లా నందిమార్గ్‌ గ్రామంలో కశ్మీరీ పండిట్ల‌పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు 24 మందిని ఊచకోత కోశారు. అందులో 11 మంది మహిళలు ఉండగా, ఇద్దరు చిన్నారులున్నారు.

= జూన్‌ 2005: పుల్వామాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ముందున్న రద్దీ మార్కెట్‌లో జూన్ 13న కారుదాడి జరిగింది. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ఉన్నారు. మరో 100 మందికి గాయాలయ్యాయి.

= జూన్‌ 2006: కుల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది నేపాల్‌, బిహార్‌కు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

= జూన్‌ 10 2017: కుల్గాం ప్రాంతంలోనే అమర్‌నాథ్‌ యాత్ర బస్సుపై దాడి చేశారు. ఈ అటాక్‌లో ఎనిమిది మంది మరణించారు

పుల్వామా.. పహల్గాంల్లోనే..

పుల్వామా ఎటాక్ 2019 : 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన దాడి యావత్‌ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. సైనికులు వెళ్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ భయంకర ఘటనలో 40మంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు
2024లోనూ జమ్మూకశ్మీర్‌లో అనేక ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. పహల్గాంలో పర్యటక జంటపై మిలిటెంట్లు దాడి చేశారు. నవంబర్‌ 3వ తేదీన శ్రీనగర్‌లో రద్దీగా ఉండే సండే మార్కెట్‌పై గ్రెనేడ్‌ దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు.

= 2024 ఏప్రిల్ 22 : పహల్గాం పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో 30 మంది పర్యాటకులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *