Exclusive – మణుగూరులో అవినీతి తిమింగలం?

చిక్కింది సొర‌చేప మాత్ర‌మేన‌ని ప్ర‌చారం
తిమింగలంపై ఫోకస్‌ పెట్టామంటున్న ఏసీబీ
ఆ అధికారిపై ఏసీబీకి వంద‌కు పైగా ఫిర్యాదులు
అక్రమార్జన మొత్తం ₹50 కోట్లకు పైగానే?
ఎవరా తిమింగలం అంటూ జోరుగా చర్చ

మణుగూరు క్రైమ్‌, ఆంధ్రప్రభ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మణుగూరు ప్రాంతంపై ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీఐ స్థాయి అధికారితో పాటు ఓ జర్నలిస్ట్‌ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం సంచలనం రేపింది. ఈ ఘటనతో మణుగూరు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడగా, ఈ ఘటన వెనుక విస్తుపోయే అనేక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం, అధికారుల అవినీతి కోణాలు వెలుగు చూడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ కేసు సందర్భంలో ఖమ్మం నుంచి వచ్చిన ఓ ఏసీబీ అధికారి, దొరికింది సొర చేప మాత్రమేనని, తిమింగలం కోసం ఎదురుచూడండంటూ హింట్‌ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ప్రకంపనలు రేపుతోంది. ఆ అవినీతి తిమింగలం దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమంగా సొమ్ము చేసుకున్నట్లు తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని, దాదాపు వందకు పైగా ఫిర్యాదులు ఇప్పటికే తమకు అందాయని ఏసీబీ అధికారి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరా తిమింగలం?

సాక్షాత్తూ ఏసీబీ అధికారులే తిమింగలం కోసం గాలిస్తున్నామని చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మణుగూరు కేంద్రంగా సాగిన అక్రమ దందాలో పెద్దన్న పాత్ర పోషించిన ఆ అధికారి ఎవరు? ఆయనది ఏ శాఖ అన్న చర్చ జోరందుకుంది. ఉద్యోగ బాధ్యతలను అమ్మకానికి పెట్టి, అక్రమంగా దండుకున్న సంబంధిత అధికారి ఎవరన్న విషయమై స్థానికులు బాహటంగానే చర్చిస్తున్నారు. ఆ అధికారి తమ వాడేనా అంటూ కొన్ని శాఖల అధికారులు తమకు తెలిసిన మీడియా ప్రతినిధులను అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయంపై స్పష్టత కోసం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనన్న సమాధానం మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది. గతంలో అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి రూ.30వేలు లంచం తీసుకుంటూ దొరకడం, తాజాగా మణుగూరు సీఐ నాలుగు లక్షలు డిమాండ్‌ చేసి, మధ్యవర్తి ద్వారా రూ.లక్ష తీసుకుంటూ దొరకడంతో, ఈ స్థాయిలో అవినీతికి అవకాశాలు కల్పించిన అధికారులెవరన్న విషయంతో పాటు మణుగూరులో అసలేం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు మణుగూరుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారని, త్వరలోనే ఆ అవినీతి తిమింగలాన్ని పట్టుకుంటారన్న విశ్వాసాన్ని మణుగూరు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మకానికి ఉద్యోగ బాధ్యతలు పెట్టిన సంబంధిత అధికారితో పాటు, చిన్నాచితకా పనులకు కూడా చేతులు తడపాలని కోరే పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు సమాచారం. అవినీతిని రూపుమాపడమే తమ ధ్యేయమని, అందుకోసం ప్రజలు సహకరించాలని ఏసీబీ అధికారులు కోరుతుండటం, అందుకనుగుణంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో మంచి రోజులు వస్తాయన్న ఆశ సర్వత్రా వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *