సంగారెడ్డి, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ ) : సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు హౌస్ ఆరెస్ట్ చేశారు. జిన్నారం గ్రామంలో కొంతమంది దుండగులు హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను కూల్చి వేయడంతో జిన్నారం వెళ్తుండగా ఆయనను అడ్డుకున్నారు. జిన్నారంలో విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా ఘోరమైన పని అని ఎమ్మెల్సీ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. మతవిద్వేషాలు, అల్లర్లు జరగడం చాలా బాధాకరమన్నారు. అలాగే కాశ్మీర్ లోని 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయంలో శివుని విగ్రహన్ని ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిన్నారం బయల్దేరి వెళ్లారు. పటాన్ చెరు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.