హైదరాబాద్ – హల్గామ్ దాడి తమ హృదయాన్ని బద్దలు చేసిందని సినీ ప్రముఖులు అన్నారు. ఈ ఘటన కలిచివేసిందని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. అలాగే మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ ఖండించారు. ఎంతో బాధగా ఉంది.. చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా అని ట్వీట్ చేశారు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూ సూద్ , నాని, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లు సోషల్ మీడియాలో స్పందించారు.
కఠినంగా శిక్షించాల్సిందే … విజయ్ దేవరకొడ
సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. పహల్గామ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం తన పుట్టినరోజును పహల్గామ్‌లోనే జరుపుకున్నానని, అక్కడి స్థానిక ప్రజల ఆప్యాయత తనకెంతో నచ్చిందని విజయ్ దేవరకొండ తెలిపారు. నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమని చెప్పారు. ఈ దారుణ ఘటన ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అన్నారు. పర్యాటకులపై కాల్పులు జరపడం దారుణమని విజయ్ చెప్పారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నానని… ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితుల తరఫున నిలబడదామని, భారతదేశం ఎప్పటికీ తలవంచదని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడదామని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా తెలిపారు..
దేశ చరిత్రలో చీకటి రోజు..
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు అని చెప్పారు. ఇలాంటి క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మనమందరం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.
పహల్గామ్ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి, దాడిని ఖండించారు. బాధితుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు.
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే – టీమిండియా క్రికెటర్లు
ఉగ్రవాద దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టొద్దని టీమిండియా క్రికెటర్లు అన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయాలని ట్వీట్ చేస్తున్నారు. టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఘటనలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిని విడిచిపెట్టవద్దని ట్వీట్ చేశారు. ఈ దాడిని మరో క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఖండించారు.