తమిళనాడు : ఓ యువకుడు తన తండ్రి మృతదేహం ఎదుట ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కడలూర్ జిల్లా కవణైకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ కుమారుడు అప్పు లా చదువుతున్నాడు. అదే కాలేజీలో తనతో పాటు చదువుతున్న విజయశాంతిని ఇష్టపడ్డాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, జీవితంలో స్థిరపడ్డ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టాలని… విషయం పెద్దలకు చెప్పారు. దాంతో ఇరువురి కుటుంబాలు భవిష్యత్‌లో వారి పెళ్లికి ఒప్పుకున్నాయి.
అయితే, సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. తన పెళ్లిని తండ్రి చూడాలనుకున్న అప్పు కనీసం ఆయన అంత్యక్రియల సమయంలో మృతదేహం ఎదుట పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో తన తండ్రి ఆశీస్సులు పొందేందుకు అప్పు తన ప్రియురాలిని ఒప్పించి మరీ ఆమె మెడలో తాళి కట్టాడు. చావుకు వచ్చిన వాళ్లంతా తీవ్రమైన దు:ఖంలోనే అప్పు పెళ్లిని చూసి వారిని ఆశీర్వదించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.