No Confidence Motion | విశాఖ‌లో హై టెన్ష‌న్ – మ‌రికొద్ది సేప‌ట్లో తేలిపోనున్న మేయ‌ర్ భ‌విత‌వ్యం ..

విశాఖ‌ప‌ట్నం – లో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇవ్వడంతో శనివారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనున్నది. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అవిశ్వాస తీర్మానం ఎలాగైనా నెగ్గాలని కూటమి నేతలు కృతనిశ్చయంతో ఉంటే…కోరం లేకుండా చేయడం ద్వారా తీర్మానం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు.

జీవీఎంసీకి నాలుగేళ్ల కిందట ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులు గెలుచుకోవడంతో మేయర్‌ పీఠంపై 11వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని హరివెంకటకుమారిని కూర్చోబెట్టారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు కార్పొరేటర్లతోపాటు టీడీపీ నుంచి గెలిచిన ఒకరు వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన 32వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకోవడంతో కౌన్సిల్‌లో ఆ పార్టీకి ఎదురులేకుండాపోయింది. అయితే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో కౌన్సిల్‌లో సమీకరణాలు తలకిందులైపోయాయి. వైసీపీ నుంచి గెలిచిన 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, మరో తొమ్మిది మంది జనసేనలో చేరిపోయారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురిలో ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు 58 మంది సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌కు నోటీస్‌ ఇచ్చారు. అందులో సంతకాల ధ్రువీకరణ అనంతరం అవిశ్వాస తీర్మానంపై శనివారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

తీర్మానం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం

మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై శనివారం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కూటమికి 74 మంది సభ్యుల మద్దతు అవసరం. జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లతోపాటు 14 మంది ఎక్స్‌అఫిషీయో సభ్యులు కలుపుకుని 111 మంది ఓటుహక్కు కలిగిన సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీకి 48, జనసేనకు 14, బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు మొత్తం కూటమికి 64 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వైసీపీకి 30 మంది, సీపీఐ, సీపీఎంకి ఒక్కొక్కరు ఉన్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆరో వార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి ప్రియాంక (మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె) తన వైఖరిని ఇంకా ప్రకటించలేదు. సీపీఐ, సీపీఎం కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ కూడా సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. కూటమి చేతిలో ఉన్న 64 మంది కార్పొరేటర్లతోపాటు 11 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు సమావేశానికి హాజరైతే అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు అవకాశం ఉంటుంది. వీరితోపాటు ముత్తంశెట్టి ప్రియాంక కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.


కాగా ఇటీవ‌ల చేరికలు అన్నీ తమకు ప్లస్ అని భావిస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలో మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. వారిని రాత్రి వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు తరలించారు. ఓటింగ్ సమయంలో కార్పొరేటర్లు నేరుగా ఆఫీసుకు రానున్నారు. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది.

వీళ్ళలో 25 మంది పార్టీ ఫిరాయించగా అనర్హత వేటుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కార్పొరేటర్లకు నేరుగాను.. క్యాంపులకు వెళ్లిపోయిన వాళ్ళ కు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని బలంగా విశ్వశిస్తున్న వైసీపీ.. ఈ వ్యవహరం అంతా ముగిసే వరకు కార్పొరేటర్ లను క్యాంప్ లోనే కొనసాగాలని నిర్దేశించింది.

జీవీఎంసీలో ప్రస్తుత బలాబలాలు
కూటమి కార్పొరేటర్లు 64
కూటమి ఎక్స్‌అఫిషియో సభ్యులు 11
వైసీపీ కార్పొరేటర్లు 30
వైసీపీ ఎక్స్‌ అఫీషియో సభ్యులు 3
తటస్థంగా ఉన్న కార్పొరేటర్లు 3

Leave a Reply