నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ) : జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు, స్వీట్ తయారీ కేంద్రాలపై బుధవారం జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా పలు హోటళ్లలో, బంధన్ స్వీట్ దుకాణాం, ఖానాపూర్ రోడ్ లో గల డ్రైఫ్రూట్స్ హౌస్ దుకాణం అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన వస్తువులను గుర్తించి ధ్వంసం చేశారు.
నోటీసులు జారీ చేశారు. అనుమానిత పదార్థాల శ్యాంపిల్లను పరీక్ష నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. హోటళ్లలో స్వీట్ దుకాణంలో కిచెన్ లు అశుభ్రంగా ఉండడం పట్ల నిర్వాహకులపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితమైన, పరిశుభ్రమైన, కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించవలసిందిగా వ్యాపారస్తులకు సూచించారు. ఇందులో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.