MBNR |ఈత బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శ

మహబూబ్ నగర్, ఏప్రిల్ 16 (ఆంధ్రప్రభ) : మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు క్వారీలో ఈతకు వెళ్లి మృతిచెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన ప్రభుత్వ జనరల్ అస్పత్రిలో మృతదేహలను పరిశీలించి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పజెప్పాలని వైద్యులను కోరారు.

ఈసందర్భంగా విలేకరులతో మాజీ మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదలకు మూడు యేండ్ల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చామని, ఇక్కడ నివాసం ఉండి చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్న కుటుంబాల్లో అనుకోని విషాదం చోటు చేసుకుందన్నారు. చేతికి వచ్చిన పిల్లలు కుటుంబాలకు ఆసరాగా ఉంటారని అనుకునుకుంటున్న సమయంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపిందన్నారు. ఇంతటి ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా పలకరించే నాధుడు లేడని, అసలు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారా అని ప్రశ్నించారు…? కనీసం జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్… ఎస్పీ కూడా వచ్చి పరామర్శించలేదని మండిపడ్డారు. కలెక్టర్..ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించాలంటే ఎవరినుంచైనా అనుమతులు కావాలా అని ఎద్దేవా చేశారు.

చిన్న జిల్లాలు అయితే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని అనుకున్నాం, కానీ అందుకు భిన్నంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని విమర్శించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, మళ్ళీ అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లేదంటే మరోసారి ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేవిధంగా తన వంతు కృషి చేస్తానని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి వెంట గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు రాఘవేందర్ గౌడ్, అంబాదాస్, శివ, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *