Economic Survey – పార్ల‌మెంట్ లో ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టిన నిర్మలా సీతారామ‌న్ …

న్యూ ఢిల్లీ – కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మూడోసారి సంపూర్ణ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రేపు ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆర్థిక సర్వే అంటే..

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా.. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది.
బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. అయితే, 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *