ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్

ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేశంలో కొంతమంది పాలకులు రాజ్యాంగాన్ని మార్చేయాలనీ, రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాలు గత్యంతరం లేకనే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచి పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంబేద్కర్ చూపిన మార్గం చదువు, చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారామని తెలిపారు. బానాజీపేట గ్రామంలో అంబేద్కర్ జయంతికి రెండు రోజుల ముందే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
బానాజీపేట గ్రామ రైతులకు సాగు నీరు వచ్చే విధంగా కల్వకు షేటర్లు ఏర్పాటు చేయిస్తానని, అలాగే అంబేద్కర్ విగ్రహం వరకు సిసి రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సిసి రోడ్డుకు అంబేద్కర్ మార్గ్ గా నామకరణం చేయాలని గ్రామస్తులకు సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్థానిక సర్పంచ్ గైని శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుల పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
