తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత…

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కుల వృత్తిదారులు, నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేందుకు అట్రాసిటీ యాక్టు తీసుకురావాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కుల వృత్తి దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్ కు వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షులు కడియాల శ్రీను మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ఆదేశాల మేరకు కుల వృత్తిదారుల న్యాయమైన సమస్యలపై తహసీల్దార్ కు వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు.

కుల వృత్తిని నమ్ముకున్న నాయి బ్రాహ్మణులు కాకుండా ఇతరులు ఈ వృత్తిలోకి రాకుండా పేటెంట్ హక్కులు కల్పించాలన్నారు.గత ప్రభుత్వం హాయాంలో కుల వృత్తిలో ఉన్న నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారన్నారు.కొంతమంది వృత్తి దారులకు లక్ష రూపాయిల ఆర్థిక అందించారని కడియాల శ్రీను అన్నారు.ఆన్లైన్లో ధరఖాస్తులు ఇప్పటికీ బిసి కార్పోరేషన్ కార్యాలయంలో ఉన్నాయన్నారు.మండల కేంద్రాల్లో కుల వృత్తిదారులు బార్బర్ షాపులను అద్దెగదుల్లో నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కుల వృత్తిదారులకు బార్బర్ షాపులను కేటాయించేందుకు ప్రభుత్వం కామన్ షెడ్లను నిర్మించాలని కడియాల శ్రీను కోరారు.జిల్లా కేంద్రాల్లో నాయి బ్రాహ్మణుల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం 200 గజాల స్థలం కేటాయించాలన్నారు. నాయి బ్రాహ్మణులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్నారు.కుల వృత్తి దారుల అభివృద్ధికి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు అందచేసిన వినతి పత్రంలో కడియాల శ్రీను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాడుగుల నాగరాజువల్లోజి రమేష్, సురేష్,కళ్యాణ,మణికుమార్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply