మంచితనం బలహీనత కాదు

మనం జీవితంలో ఎదుగుతున్న కొలదీ ఎందరో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వయస్సు, స్థాయి పెరుగుతున్న కొద్దీ హూందాగా వ్యవహరించడం అలవరచుకోవాలి. అన్నంత మాత్రాన చలాకీగా, చురుగ్గా వుండకూడదని కాదు. స్థాయిని మరచి చౌకబారుగా చరించడం వేరు. కొందరు ఎవ్వరితోనైనా పరాచికాలు ఆడుతూ వుంటారు. అలా పనికిరాదు. అంటే జైలులో ఖైదీలాగా వుండమనడం లేదు. బయట నలుగురిలో ఉన్నప్పుడు కొంత బాలెన్స్‌ పాటించాలి. మన మనస్సునూ, ఆలోచనలనూ సమతూకంలో ఉంచకుంటూనే, వారితో పరిచయాల్ని కొనసాగించాలి. మీ మాటల్లో నిజాయితీ వుండాలి. స్వార్థము పనికిరాదు. ఈ వ్యక్తితో మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి అన్నతంగా, బలంగా కనిపించాలి. మన మంచితనాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకునేందుకు ప్రయత్నిస్తారు. మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. వారు అలాంటి సాహసం చేయకుండా, మన బలాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి అందరికన్నా భిన్నంగా ఉంటూ, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడో, అప్పుడు ఆ సమాజం ఆ వ్యక్తిని లొంగదీయాలని చూస్తుంది. మనం వారికి లొంగకుండా, మన హద్దుల్లో ముద్దుగా వ్యవహరించాలి. మన మాటకు విలువలేని చోట మౌనంగా వుండటం మేలు. తగుదునమ్మా, అంటూ అన్ని విషయాల్లో తలదూర్చరాదు. అడగకపోయినా అభిప్రాయాలు చెప్పకూడదు. మీరు గమనించారో లేదో మనం తరచూ ఒక వ్యక్తిని కలుస్తున్నామనుకోండి, కబుర్లు పెరుగుతాయి. మనకు తెలియకుండానే మనం మన ఆంతరంగిక విషయాలను బయటపెడతాము. ఒక్కోసారి మనస్సుపైన నియంత్రణ కోల్పోయి, మాటలు హద్దుల్ని దాటుతాయి. మనకు ఒక సామెత వుండనే ఉంది. చనువిస్తే చంకనెక్కుతారని. మీరు చేయి కలిపితేనే నెత్తినెక్కి కూర్చునే రోజులివి. ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక జీవన శైలిలో ఒక్కోసారి కలుసుకున్న వ్యక్తులు కూడా మనకు ఆత్మీయులుగా తోస్తారు. మన రహస్యాలను బయట పెట్టేస్తాము. తద్వారా తర్వాత మీరు కొన్ని ఊహించని పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందినకొద్దీ, మాధ్యమాల ప్రభావం వలన ఈ బలహీనత మరింత పెరిగింది. ఆధునికత పేరుతో ఫేక్‌ వ్యక్తిత్వాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, గుడ్డిగా నమ్మేస్తున్నాము. బయట వుంచి మాట్లాడాల్సిన వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము. డ్రాయింగ్‌ రూమ్‌ వరకు మాత్రమే రావాల్సిన వారిని బెడ్‌రూమ్‌ వరకూ తీసుకువెళ్తున్నాము. దీనివలన హాయిగా సాగాల్సిన మన జీవితంలో అనుకోని, ఊహించని క్షణాలు ఎదురవుతున్నాయి. అందుకే మనం మనకుగా ఒక లక్ష్మణ రేఖను నిర్దేశించుకోవాలి. పరిచయాలూ, పలకరింపులూ హద్దు మీరకుండా చూసుకోవాలి. మొహమాటం అసలు పనికిరాదు. కొన్ని సందర్భాల్లో దృఢంగా వుండాలి. కుదరదంటే కుదరదని చెప్పగలగాలి. అలా చెప్పడానికి సంకోచించరాదు. ఎవ్వరితోనూ అతిగా పరిచయాల్ని పెంచుకోరాదు. ఎవ్వరితో ఎంతవరకో అంతవరకే ఉండాలి. అది మీ వ్యక్తిత్వానికి శోభను చేకూరుస్తుంది. మితంగా వుంటేనే గౌరవము, ఆదరణ. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మనిషికి ఎల్లప్పుడూ అలంకారాలే మరి.

  • డా||పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply