గూడూరు (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన యువరైతు అప్పుల బాధతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య కవిత తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి… తన భర్త దేవరాజు పొలం సాగు చేయడానికి అప్పులు చేశారని, అయితే పంటలు సరిగా పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నిరాశతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెందేవాడని తెలిపింది.
ఈ మేరకు రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య కవిత తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.