కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు…

కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు…
ముసాయిదా చట్టంపై విస్తృత చర్చలు
హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కోసం ఉద్యమం వేగం
కర్నూలు, ఆంధ్రప్రభ : హిందూ దేవాలయాల స్వతంత్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన ముసాయిదా చట్టంపై అవగాహన కల్పించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులో ఆదివారం నిర్వహించిన సదస్సు విశేషంగా జరిగింది. కే.సీ.కెనాల్ సమీపంలోని సప్తగిరి నగర్లో శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి ఆలయం పక్కనున్న శివాలయం సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనలతో ప్రారంభమైన ఈ సదస్సులో విహెచ్పీ జిల్లా అధ్యక్షులు టీ.సీ. మద్దిలేటి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా హిందూ దేవాలయాల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కల్పించకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 25, 26 ప్రకారం ప్రభుత్వాల జోక్యం రాజ్యాంగ ఉల్లంఘనకే సమానమని పేర్కొన్నారు. ఆదోని జిల్లా విహెచ్పీ అధ్యక్షులు బసవన్న గౌడ్ మాట్లాడుతూ, హిందూ దేవాలయాల వ్యవస్థపై ప్రభుత్వాల వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలను వినియోగిస్తున్నారని, హిందూ ధర్మంపై వ్యతిరేక భావజాలం పెరుగుతోందని విమర్శించారు. అచలానంద ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విరజానంద స్వామి ఆశీర్వచనం అందిస్తూ, ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో అన్యమతస్థులు, నాస్తికులు ప్రవేశించడం వల్ల పవిత్రత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలయాల ఆదాయాల దుర్వినియోగం, భూముల ఆక్రమణ వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. వక్తగా విచ్చేసిన విహెచ్పీ రాష్ట్ర సహకోశాధికారి గూడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం విహెచ్పీ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సుమారు 1000 దేవాలయాలపై అధ్యయనం చేసి, ధర్మాచార్యులు, మాజీ న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, దేవాదాయ శాఖ ప్రతినిధులతో చర్చించి ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

ఈ డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ భయ్యి వాసు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సదస్సులో శ్రీ లలితా పీఠం వ్యవస్థాపకులు గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, విశేష సంపర్క ప్రముఖ్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శులు ఈపూరి నాగరాజు, హనుమంతు రెడ్డి, సహకార్యదర్శులు గూడూరు గిరిబాబు, సంగు రాంబాబు, కారణం సుధాకర్, అర్చక పురోహిత ప్రముఖ్ శివకోటి చంద్రశేఖర్, అభిలాష, బీజేపీ రాష్ట్ర నాయకులు కాశివిశ్వనాథ్, బీజేవైయం సునీల్, బజరంగ్ దళ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చివరిగా శాంతిమంత్రంతో పాటు భోజన కార్యక్రమంతో సదస్సు ముగిసింది.
